International drug gang arrested: హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు సూడో ఎఫిడ్రిన్ మాదకద్రవ్యాన్ని రవాణా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలోని మరో ఇద్దరు మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులకు చిక్కారు. గాజుల బాక్సులు, బ్రాండెడ్ దుస్తుల పెట్టెల లోపలి భాగంలో సూడో ఎఫిడ్రిన్ దాచి.. కొరియర్ ఏజెన్సీల ద్వారా పంపిస్తున్నారు. గతేడాది డిసెంబరులో రాచకొండలో భారీమొత్తంలో సూడోఎఫిడ్రిన్ పట్టుబడిన కేసులో వీరిద్దరూ నిందితులు.
అప్పుడు రసూలుద్దీన్, మహ్మద్ కాశీంలు ఇద్దరు అరెస్ట్ కావడంతో గత కొన్ని రోజులుగా దందా ఆపేసిన నిందితులు ఫిబ్రవరిలో మళ్లీ డ్రగ్స్ రవాణా మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు సరుకు పంపేందుకు సిద్ధమవుతుండగా మాటువేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. షేక్ ఫరీద్ మహ్మద్ అలీ, ఫైజారుణ్ ముజాహిద్‌లను అరెస్ట్ చేసిన వీరి నుంచి రూ.55 లక్షల విలువైన 500 గ్రాముల సూడో ఎఫిడ్రిన్, 80 గ్రాముల బంగారం, పాస్‌పోర్టు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఈ కేసులో నలుగురు నిందితులు అరెస్టు చేయగా.. కీలక డ్రగ్ డాన్ రహీమ్ షా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
"ముజాహిద్ మహారాష్ట్రలోని పుణెకు చెందిన షేక్ ఫరీద్ మహ్మద్ అలీ, ఫైజారుణ్ ముజాహిద్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. చెన్నైలో నివాసం ఉంటున్న తన సోదరిని కలిసేందుకు తరచూ వెళ్లే షేక్ ఫరీద్ అక్కడే స్మగ్లింగ్ దందాలో అడుగుపెట్టాడు. తన బావ బషీర్ అహ్మద్‌తో కలిసి మలేషియాకు వెళ్లి ఎలక్ట్రానిక్ సిగరెట్లు, స్మార్ట్ వాచీలు, సెల్‌ఫోన్లు, కెమెరాలు, గృహోపకరణాలు కొనుగోలు చేసి దొడ్డిదారిలో చెన్నైకి తీసుకొస్తారు.
Drug gang arrested: స్థానికంగా రెట్టింపు ధరకు అమ్ముతారు. లాభసాటిగా ఉండడంతో ఫరీద్ తన స్నేహితడైన ఫైజన్‌ను కూడా ఈ దందాలోకి దింపాడు. ఇదే క్రమంలో ఫరీద్, ఫైజన్‌లకు డ్రగ్స్ రవాణాలో ఆరితేరిన చెన్నైకి చెందిన రసూలుద్దీన్ పరిచయమయ్యాడు. రసూల్ వారికి లాభాల ఆశ చూపించి డ్రగ్స్ రవాణాలోకి దించాడు. కొన్ని రోజుల తరువాత మహ్మద్ కాశీం కూడా వీరికి తోడయ్యాడు. రసూల్, ఫరీద్, ఫైజన్, కాశీం చెన్నైలోని ట్రిప్లికేన్‌కు చెందిన డ్రగ్ డాన్ రహీమ్ షా ఆదేశాలతో పనిచేసేవారు. కమీషన్ల లెక్కన తీసుకుని పుణె, హైదరాబాద్ విమానాశ్రయాల ద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు సూడో ఎఫిడ్రిన్ తరలించేవారు.
సాధారణంగా విమానాశ్రయాల్లో కస్టమ్ అధికారుల తనిఖీలు, యంత్రాల స్కానింగ్‌లో అన్ని రకాల డ్రగ్స్ పట్టుబడతాయి. పౌడర్ రూపంలో ఉండే సూడోఎఫిడ్రిన్ మాత్రం స్కానర్‌కు చిక్కదు. దీన్ని అదనుగా చేసుకున్న నిందితులు తరచూ రవాణా చేస్తున్నారు. మొదట బస్సులు, రైళ్ళు, రోడ్డు మార్గాల్లో వెళ్లి అక్కడ నుంచి కొరియర్ సంస్థల ద్వారా ఈ డ్రగ్‌ను పంపిస్తారు. నలుగురు నిందితులు కలిసి పుణె విమానాశ్రయం మీదుగా డిసెంబరు వరకూ 15 సార్లు రూ.వందల కోట్ల విలువైన సూడో ఎఫిడ్రిన్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తరలించారు. చెన్నైలో ఉండే రహీమ్.. సరకు ఎక్కడ ఉంది..? ఎక్కడకు పంపాలో చెబుతాడు. రవాణా ఛార్జీలు, చిరునామాలు అతనే ఇస్తాడు. నలుగురూ కలిసి కమీషన్ల చొప్పున తీసుకుని కొరియర్ల ద్వారా సరకు పంపిస్తారని" పోలీసులు వెల్లడించారు.