HCU Professor Attempted To Rape Thailand Student : హైదరాబాద్ నగరంలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో దారుణం చోటుచేసుకుంది. థాయిలాండ్‌కు చెందిన విద్యార్థినిపై వర్సిటీ ప్రొఫెసర్ అత్యాచారాయత్నానికి పాల్పడ్డారు. ఆ సమయంలో విద్యార్థిని తృటిలో తప్పించుకొని పారిపోయింది. ఈ మేరకు బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్‌పై పోలీసులు సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రొఫెసర్ పోలీసుల అదుపులో ఉన్నారు.
అసలేం జరిగిందంటే.."హిందీ నేర్చుకునేందుకు థాయిలాండ్ నుంచి హెచ్‌సీయూకు విద్యార్థిని వచ్చింది. హిందీ పుస్తకం ఇస్తానని ఆమెను ప్రొఫెసర్ రవిరంజన్ తన ఇంటికి తీసుకెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విద్యార్థినిని తన ఇంటికి తీసుకెళ్లాడు ప్రొఫెసర్. ఇంటికి తీసుకువెళ్లి కూల్‌డ్రింక్‌లో లిక్కర్ కలిపి ఇచ్చాడు. మద్యం తాగించి అమ్మాయిపై లైంగిక దాడికి యత్నించాడు. ఎలాగోలా ఆ అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకుని వర్సిటీ అధికారులకు కాల్ చేసింది. రవిరంజన్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు అధికారులకు ఫోన్‌లో చెప్పింది. వెంటనే స్పందించిన అధికారులు రవిరంజన్‌కు కాల్ చేసి వెంటనే ఆ విద్యార్థినిని వర్సిటీలో దింపాలని చెప్పారు. ప్రొఫెసర్ రవిరంజన్ శుక్రవారం రాత్రి 9 గంటలకు వర్సిటీ గేటు వద్ద బాధితురాలిని వదిలిపెట్టాడు. అమ్మాయిని తీసుకువెళ్లినప్పుడు ప్రొఫెసర్ ఇంట్లో ఎవరూ లేరు. బాధితురాలు, యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రొఫెసర్‌పై ఐపీసీ 354, 354 ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. నిందితుడు రవిరంజన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం." అని మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు తెలిపారు.
ఇంతకుముందు కూడా ఇలాగే చేశాడు.. గతంలోనూ రవింరంజన్ విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయని వర్సిటీ విద్యార్థినులు తెలిపారు. అప్పట్లో నమోదైన కేసుల్లో చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజుల క్రితం ఉమెన్‌ఎంపవర్‌మెంట్‌పై ప్రొఫెసర్ రవిరంజన్ ఉపన్యాసం ఇచ్చాడు. ఈ తరుణంలో అత్యాచార ఆరోపణలు రావడం కలకలం సృష్టిస్తోంది.