house burglaries in hyderabad : హైదరాబాద్ నగరంలోని శివారు ప్రాంతాల్లోని తాళం వేసి ఉన్న ఇళ్లే దొంగల టార్గెట్. పండుగకు ఊరెళ్లి ఇంటికి వచ్చేసరికి... దోచేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ఆదిబట్ల పీఎస్ పరిధిలోని రాగన్నగూడ లక్ష్మి మెఘా టౌన్ షిప్ కాలనీలో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. ఓ ఇంట్లో ఆరు తులాల బంగారం, రూ.3వేల నగదు, మరో ఇంట్లో రెండున్నర తులాల బంగారం, రూ.7వేల నగదు ఎత్తుకెళ్లారు. మరో రెండు ఇళ్లల్లో చోరీకి యత్నించారు. చుట్టుపక్కల వాళ్లు మేల్కొనడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.
కోటి రూపాయల ఆభరణాలు చోరీ
మూడు రోజుల క్రితం ఎస్సార్ నగర్ పీఎస్ పరిధిలోని రాజీవ్ నగర్లో చోరి జరిగింది. ఓ స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో 4 కిలోల బంగారం, 4 కిలోల వెండి, రూ.25లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఇంటికి వేసి ఉన్న తాళాన్ని పగలగొట్టిన దొంగలు... బీరువా, లాకర్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారు. వాటి మొత్తం విలువ కోటి రూపాయలు ఉంటుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అపార్టుమెంట్లో ఉన్న పక్క ఫ్లాట్ల యజమానులకు ఎలాంటి అనుమానం రాకుండా చోరీ చేశారు. ఓ పాత నేరస్థుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
తాళాలు పగలగొట్టి...
గత వారం దుండిగల్ పీఎస్ పరిధిలోని సూరారం విశ్వకర్మ కాలనీ, సాయిబాబా నగర్లో రెండు ఇళ్ల తాళాలను పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. రెండు ఇళ్లల్లో కలిపి 6.5తులాల బంగారం, 32 తులాల వెండి చోరికి గురైంది. కూకట్ పల్లిలోని ఎల్లమ్మబండలో ఇంటి తాళాలు పగలగొట్టి దోచేశారు. 8 తులాల బంగారు ఆభరణాలు, 30తులాల వెండి, రూ.20వేల నగదను అపహరించారు. ఇంట్లోని కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్లో ఓ శుభకార్యానికి వెళ్లి మరుసటి రోజు ఉదయం 6గంటలకు ఇంటికి వచ్చే సరికి దోచేశారు. జంతువులను ఎత్తుకెళ్లే ముఠా శివారు ప్రాంతాల్లో సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. నిజాంపేటలోని మేకల దొడ్డిలోకి చొరబడిన ఓ దొంగ మేకను చంపాడని... అలికిడి విని దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.