తెలంగాణ

telangana

ETV Bharat / crime

Loan apps: రుణయాప్‌ల వేధింపులు.. డబ్బు ఎరవేసి బాధితులకు చుక్కలు

Loan apps: మీకు డబ్బులు కావాలా..? అందుకు ఎటువంటి హామీ అవసరం లేదు. కేవలం ఆధార్, పాన్‌ కార్డు ఉంటే చాలు.. డబ్బులు నిమిషాల్లో మీ ఖాతాలో జమచేస్తాం. అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలిస్తారు. ఆకర్షితులై ఆశపడ్డారా.. మీ పని అంతే. పత్రాలు లేకుండా.. సులువుగా రుణాలు ఇస్తున్నారు కదా అని చాలా మంది డబ్బులు తీసుకుంటున్నారు. తర్వాత అధిక వడ్డీలు చెల్లించలేక లబోదిబోమంటున్నారు. బాధితుల పరువు తీసేలా సందేశాలు, ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర ఫొటోలు పెడుతూ వేధిస్తున్నారు. ఇటీవల ఈ తరహాకు చెందిన ఫిర్యాదులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు అందుతున్నాయి.

harassment-by-instant-loan-apps
harassment-by-instant-loan-apps

By

Published : Jun 8, 2022, 5:28 PM IST

Loan Apps: డబ్బు ఎరవేసి బాధితులకు నరకం చూపుతున్నారు. ఏ హామీ లేకుండా డబ్బులిస్తామంటూ రుణయాప్‌లు మధ్యతరగతి వారిని ఆకర్షిస్తున్నాయి. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పుడే ఫోన్‌లోని కాంటాక్టులు, ఫొటోలు, వ్యక్తిగత సమాచారం గ్రహించేలా అనుమతి తీసుకుంటున్నాయి. కొండపల్లికి చెందిన ఓ యువకుడు.. ఎస్‌ లోన్, మ్యాజిక్‌ లోన్, లోన్‌ లింక్, ఇన్‌స్టా క్రెడిట్, క్యాష్‌ పాల్, మై రూపీ, హ్యాండీ లోన్, తదితర యాప్‌ల నుంచి 7లక్షల52వేల24 రూపాయలను రుణం తీసుకున్నాడు. రుణాన్ని ప్రతి వారం చెల్లించేవాడు. ఇలా అధిక వడ్డీతో కలిపి 14లక్షల38వేల107రూపాయల వరకు చెల్లించాడు. అయినా.. రుణ యాప్‌లకు సంబంధించిన ఉద్యోగులు ఫోన్‌ చేసి ఇంకా చెల్లించాల్సి ఉందని వేధించేవారు. అభ్యంతరకరమైన భాషలో మాట్లాడేవారు. యువకుడి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వాట్సాప్‌ ద్వారా పంపి బెదిరించేవారు. వీటిని తట్టుకోలేక.. ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.

విజయవాడ శివారు ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె హ్యాండీ లోన్, ఫెయిర్‌ క్రెడిట్, హనీ లోన్, క్విక్‌ లోన్, క్యాష్‌ జీ, క్యాష్‌ అడ్వాన్స్, తదితర యాప్‌ల ద్వారా 55వేల435 రూపాయల రుణం తీసుకుంది. ఆమె దాదాపు 2 లక్షల వరకు చెల్లించింది. అయినప్పటికీ.. యాప్‌లకు చెందిన ప్రతినిధులు ఆ యువతికి ఫోన్‌ చేసి, ఇంకా రుణం తాలూకు మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉందని బెదిరించడం ప్రారంభించారు. యువతికి చెందిన ఫొటోలను అసభ్యకరంగా మార్చి.. 76 వాట్సాప్‌ నెంబర్ల నుంచి పంపించారు. నాలుగు నెంబర్ల నుంచి ఫోన్లు చేస్తూ అభ్యంతరకరంగా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టేవారు. వారి ఆగడాలు భరించలేని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐటీ యాక్ట్‌ ప్రకారం సెక్షన్‌ 67, 67బి కింద కేసు పెట్టామని సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో బెంగళూరులో దాడులు చేసి పలువురిని అరెస్టు చేశామని తెలిపారు.నిందితుల ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఈ యాప్‌ల నుంచి తేలికగా రుణాలు వస్తున్నాయని తీసుకుంటే చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా డబ్బులు చెల్లించినా వేధింపులకు గురైతే తక్షణమే పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేయాలని కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details