తెలంగాణ

telangana

ETV Bharat / crime

తేలుతున్న భూములు.. తెరలేచిన అక్రమాలు

ఎండలు ముదురుతున్న కొద్దీ చెరువుల్లో నీరు అడుగంటుతుండడంతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల పరధిలోని ఖాళీ స్థలాలను మట్టితో పూడ్చి అనుమతి లేకున్నా నిర్మాణాలు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మేస్తున్నారు. ఈ పరిధిలోని భూములకు పట్టాలున్నా అమ్మడానికి, ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లా కేంద్రాల్లోని చెరువుల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేస్తున్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలోని పట్టా స్థలాలు ప్లాట్లుగా మారుస్తున్నారు. రాజకీయ అండదండలతోపాటు ఆర్థికంగా బలంగా ఉన్నవారు అక్రమాలకు పాల్పడుతున్నారు.

government-land-grabbing-in-wanaparthy-district-with-leaders-support
తేలుతున్న భూములు.. తెరలేచిన అక్రమాలు

By

Published : Mar 15, 2021, 1:32 PM IST

వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువు విస్తీర్ణం 229.24 ఎకరాలు, శిఖం 80.11 ఎకరాలు. మినీట్యాంకుబండ్‌ నిర్మాణ పనులూ కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో వచ్చిన వరద నీరు ఎఫ్‌టీఎల్‌ స్థాయికి చేరింది. అప్పట్లో స్థలాలు నీట మునిగి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.

నేతల మద్దతుతో..

పట్టణంలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యం 1.30 ఎకరాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది. సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరో రెండు చోట్ల 0.28, 0.2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు వెలిశాయి. 0.25 ఎకరాలు ఓ ఆయిల్‌ మిల్లు యజమాని, 0.20 ఎకరాలు కట్టెల కోత మిషన్‌ యజమాని చెరువు పరిధిలోని భూములు కొన్నారు. ఇవన్నీ అక్రమాలేనని అధికారులు నిర్ధరించినా వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వారికి రాజకీయ నేతల మద్దతు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్ల వ్యవహరిస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే ప్రాంతంలో మరో వ్యక్తి చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి వచ్చే స్థలాన్ని మట్టితో పూడ్చి అక్రమాలకు తెరలేపుతున్నాడు. ఓ ప్రజాప్రతినిధితో ఆయనకు స్నేహం ఉండటంతో అధికారులు అతని వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలున్నాయి.

నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ పరిధిలో చదును చేస్తున్న దృశ్యం

అనుమతులు లేకుండానే..

వనపర్తి పట్టణంలోని తాళ్లచెరువు విస్తీర్ణం 41.33 ఎకరాలు, శిఖం విస్తీర్ణం 4.02 ఎకరాలు, కట్ట విస్తీర్ణం 10.15 ఎకరాలు. ప్రస్తుతం ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని పట్టా భూముల్లో పురపాలక సంఘం అనుమతి లేకుండానే ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు పట్టా భూములంటూ అమ్ముకుంటున్నారు. చెరువు కట్టను సగం వరకు తవ్వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు చుట్టుపక్కల నిర్మించిన ఇళ్లు సైతం నీట మునిగాయి. ఎండల తీవ్రతకు నీరు అడుగంటడంతో చెరువు స్థలం బయటపడుతోంది. గతంలో ఈ స్థలాన్ని కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్లాట్లుగా మార్చి విక్రయించడంతో కొన్నవారు ఇక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ, ఆ ప్రాంతంలోని కేసరి సముద్రంలో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల పరిధిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రధాన రహదారికి సమీపంలో ఉండడంతో దుకాణ సముదాయం, ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ చెరువుల్లో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలోకి వచ్చే భూమికి పట్టాలున్నాయంటూ లేఅవుట్లు చేసి ప్లాట్లు విక్రయించారు. పాత జిల్లా పరిషత్తు భవనం సమీపంలోని కేసరి సముద్రానికి చెందిన భూమిని ఒకరు లేఅవుట్‌గా మార్చి అమ్మేశారు. మరొకరు ఉయ్యాలవాడ చెరువు పరిధిలోని భూమిని ఇళ్ల స్థలాల కోసం విక్రయించారు. ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులే కావడం గమనార్హం. అక్కడ స్థలాలు కొన్నవారు ప్రస్తుతం నిర్మాణాల కోసం మట్టిపూడ్చి స్థలాన్ని సమాంతరం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.

అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు..

పురపాలక సంఘం పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. ఉయ్యాలవాడ చెరువు, అక్కడి పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఇప్పటి వరకు ఫిర్యాదులు అందలేదు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులతో తనిఖీలు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

- గోనే అన్వేష్‌, కమిషనర్‌, నాగర్‌కర్నూల్‌ పురపాలక సంఘం

తనిఖీలకు ఆదేశిస్తా..

అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణాలు మా దృష్టి రాలేదని వనపర్తి పురపాలక సంఘం కమిషనర్ మహేశ్వర్​రెడ్డి తెలిపారు. తాళ్లచెరువు, నల్లచెరువు పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణాలపై తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని... అయిదు నెలల కిందట తాళ్లచెరువుకు సర్వే చేసి హద్దులు నిర్ధరించామని పేర్కొన్నారు. పురపాలక సంఘంలో అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ చేపడుతున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:రెచ్చిపోతున్న భూ బకాసురులు.. అడ్డొచ్చిన అధికారులపై దాడులు

ABOUT THE AUTHOR

...view details