ఉరి వేసుకుని.. ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగింది. ఒడిషాకు చెందిన ఈ మైనర్ మృతికి.. ప్రేమ వ్యవహారంలో ప్రియుడితో ఏర్పడ్డ మనస్పర్థలే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
ఒడిషా రాష్ట్రం బద్రక్ గ్రామానికి చెందిన ధర్మజిత్, లేజారాణి అనే ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించరనే భయంతో.. 45 రోజుల క్రితం ఇంటిని విడిచి రాష్ట్రానికి వచ్చారు. పెళ్లి జరిగిందని చెప్పి.. అమీన్పూర్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ధర్మజిత్ స్థానికంగా ప్లంబర్‌గా పనిలో చేరాడు.
ఈనెల 12వ తేదీన ధర్మజిత్ ఇంట్లో లేని సమయంలో.. లేజారాణి ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మనస్పర్థలతోనే బాలిక బలవన్మరణానికి పాల్పడిందని ప్రాథమికంగా తేల్చిన పోలీసులు.. ధర్మజిత్పై కేసు నమోదు చేశారు. బాలికను ఇంట్లో నుంచి తీసుకొచ్చిన ఘటనలో.. ఇప్పటికే ఒడిషాలో అతనిపై మరో కేసు నమోదై ఉంది.
లేజారాణి మరణ వార్త విన్న తండ్రి పద్మలోచన్.. హుటాహుటిన రాష్ట్రానికి వచ్చాడు. విగత జీవిగా పడి ఉన్న కూతురిని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. మృతదేహాన్ని స్వరాష్ట్రానికి తీసుకెళ్లే ఆర్థిక స్థోమత లేకపోవడంతో.. స్థానిక ఎండీఆర్ ఫౌండేషన్‌ను ఆశ్రయించాడు. పటాన్చెరు శ్మశాన వాటికలో.. వారు అంత్యక్రియలు జరిపించారు.
ఇదీ చదవండి:చెరువులో దూకి తల్లీకూతురు బలవన్మరణం