మంచిర్యాల జిల్లా (manchirial district) శ్రీరాంపూర్ సింగరేణి ఎస్‌ఆర్పీ-3 బొగ్గు గనిలో పైకప్పు కూలిన ప్రమాదంలో (Srirampur roof collapse ) నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు (four coal miners die ). విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా బొగ్గు గని పైకప్పు కూలింది. అధికారులు, తోటి కార్మికులు తెలిపిన సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం విధులకు హాజరైన ఇద్దరు సపోర్ట్‌మన్ కార్మికులు, మరో ఇద్దరు బదిలీ ఫిల్లర్లు శిథిలాల కింద చిక్కుకొని మృత్యువాత పడ్డారు. గని పైకప్పు కూలకుండా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే మూడు మీటర్ల మందం, పది మీటర్ల పొడవు, మూడు మీటర్ల వెడల్పు మేర కప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. టింబర్‌మన్ కార్మికుడు బేర లక్ష్మయ్య (60), సపోర్ట్‌మన్ వి.కృష్ణారెడ్డి (59), గడ్డం సత్యనరసింహరాజు (31), రెంక చంద్రశేఖర్ (32) అక్కడికక్కడే మరణించారని సింగరేణి సంస్థ ప్రకటించింది. ‘కోల్ కట్టర్ కార్మికులు బొగ్గును డిటోనేటర్లతో పేల్చిన తర్వాత బయటకు వెళ్లారు. తర్వాత పది నిమిషాలకు గని పైకప్పు కూలకుండా చేయడానికి నలుగురు కార్మికులు అక్కడకు వెళ్లిన క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. అక్కడకు సమీపంలోనే పనిచేస్తున్న కొందరు సురక్షితంగా బయటపడ్డారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి సహాయక చర్యలు చేపట్టారు. సాయంత్రం అయిదు గంటలకు రెంక చంద్రశేఖర్ మృతదేహాన్ని ఉపరితలానికి చేర్చారు. రాత్రి 9.30 గంటలకు మిగతావారి మృతదేహాలను వెలికితీశారు’ అని వెల్లడించింది. సంఘటనా స్థలాన్ని కొత్తగూడెం కార్పొరేట్ జీఎం సుభాని, ఏరియా జనరల్ మేనేజర్ సురేశ్, ఎస్ ఓ టూ జీఎం గుప్తా, ఏరియా రక్షణాధికారి మల్లేశ్, గని మేనేజర్ రవికుమార్, రక్షణాధికారి కె.వెంకటేశ్వర్‌రెడ్డి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. తెబొగకాసం ఉపాధ్యక్షుడు కె.సురేందర్‌రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
విచారణకు ఆదేశం: సీఎండీ శ్రీధర్