Four People Arrested for Supplying Drugs : కొందరు యువకులు అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించాలని, తొందరగా ధనవంతులు అవ్వాలని చట్టానికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు. అందులో ప్రధానంగా డ్రగ్స్ సరఫరావైపే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. చివరకు పోలీసులకు చిక్కి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తుండగా నలుగురు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎస్.ముత్తు కుమార్(32), ఎ.సౌందర రాజన్(45)లతో యోగేశ్, మహేశ్వర్లు పరిచయం పెంచుకున్నారు. వీరు మత్తు పదార్థాలను అక్రమంగా వారికి రవాణా చేసేవారు. దీంతో పాటు నకిలీ కందిపప్పును కూడా పంపిణీ చేసేవారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు డిసెంబర్ 12న నార్కోటిక్ ఎన్పోర్స్మెంట్ వింగ్ సహాయంతో అమీర్‌పేటలోని అహ్మద్ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద ముత్తు, సౌందర రాజన్‌లు కేజీ ఆల్ఫాజోలం మత్తు పదార్థాన్ని విక్రయిస్తుండగా పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో భరత్, గంగాధర్ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ముఠాకు చెందిన యోగేశ్, మహేశ్వర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు.