Film Stars in Hyderabad Drugs Case : మత్తు మాఫియా ప్రధాన సూత్రధారులను హైదరాబాద్ పోలీసులు వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. స్మగ్లర్లు, పెడ్లర్ల నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న, విక్రయిస్తున్న వారిలో నగర వ్యాపారులతోపాటు బాలీవుడ్, టాలీవుడ్ సినీతారలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. మరిన్ని వివరాలు సేకరించాక నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు.
హైదరాబాద్ నార్కోటిక్స్ (హెచ్‌న్యూ) ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఏర్పాటయ్యాక నగరానికి చేరుతున్న మాదకద్రవ్యాల మార్గాలపై నిఘా ఉంచారు. గోవా కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలున్న కీలక సూత్రధారులు 18 మందిని గుర్తించారు. వీరిలో ప్రీతీష్ నారాయణ్ బోర్కర్, జాన్ స్టీఫెన్ డిసౌజా, తుకారాం, ఎడ్విన్‌న్యూన్స్, బాలమురుగన్, హేమంత్ అగర్వాల్, వికాస్‌నాయక్, సంజ గోవెకర్, రమేష్‌చౌహాన్ వంటి డ్రగ్ కింగ్‌పిన్‌లను అరెస్ట్ చేశారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సెల్‌ఫోన్లలో సుమారు 7,000-8,000 మంది డ్రగ్స్ వినియోగిస్తున్న వారి వివరాలున్నట్టు గుర్తించారు. వీరిలో 400 మందికి 41ఎ సీఆర్‌పీసీ నోటీసులు జారీచేశారు.
ఎడ్విన్ అనుచరులే అధికం:గోవా డ్రగ్ కింగ్‌పిన్ ఎడ్విన్ న్యూన్స్ నుంచి తాజాగా అరెస్టయిన హైదరాబాద్ డీజే మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరాన్ మోహిత్ వరకూ ఎక్కువమంది పబ్‌లు, హోటళ్లలో సర్వర్లుగానే కెరీర్ ప్రారంభించటం గమనార్హం. జీరో నుంచి హీరోగా ఎదగాలనే ఉద్దేశంతో వీరంతా క్రమంగా మత్తుపదార్థాల దందా వైపు అడుగులు వేశారు. మొదట ఏజెంట్లుగా మారారు. క్రమంగా డ్రగ్ మాఫియాతో సంబంధాలు పెంచుకొని మత్తు సామ్రాజ్యాన్ని స్థాపించి.. జాతీయ, అంతర్జాతీయంగా మాదకద్రవ్యాలు సరఫరా చేసే స్థాయికి ఎదిగారు.