Father and Son Died in Jakaram : భూ తల్లిని నమ్ముకుని బతుకుతున్న అతడు ఆ తల్లిని కాపాడుకోవడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. ఇంతలోనే ఆ పుడమి తల్లి కోసం తగాదాలు మొదలయ్యాయి. చివరకు చిన్నతనం నుంచి మట్టిలోనే మమేకమైన ఆ రైతు పుడమి తల్లిని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బాధ తట్టుకోలేని అన్నదాత గుండె చెరువైంది. ఓవైపు అప్పుల బాధ.. మరోవైపు భూ తగాదాలు ఆ కర్షకుణ్ని కష్టాల్లోకి నెట్టేశాయి. ఏళ్ల నుంచి అనుభవిస్తున్న ఈ బాధలతో విసిగిపోయిన ఆ రైతు ఇంకొక్క క్షణం కూడా భరించలేనని అనుకున్నాడు.
తండ్రి బాటలో తనయుడు.. నాన్న చనిపోయిన చోటే ఉరేసుకుని.. - జాకారంలో తండ్రీకొడుకులు ఆత్మహత్య
Father and Son Died in Jakaram : తండ్రి బాటలో తనయుడు నడవడం అనేది సాధారణం. కానీ అది ప్రాణాలు తీసుకునేలా చేస్తే? అప్పుల బాధలు, భూ తగాదాలతో విసిగివేసారిపోయిన ఓ రైతు పొలంలోనే ఉరి వేసుకోగా.. నువ్వు చూపిన బాటలోనే నేను.. నిన్ను విడిచి నేనుండలేను నాన్నా.. అంటూ కుమారుడు కూడా అదే చోట ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండలంలోని జాకారం గ్రామంలో చోటుచేసుకుంది.
Father and Son Died in Rangareddy : తననే ఆదర్శంగా తీసుకుని.. తన బాటలో నడుస్తోన్న కుమారుణ్ని మరిచిపోయాడు. తన కోసమే బతుకుతున్న అర్థాంగి గురించి ఆలోచించలేకపోయాడు. తాను నడిచిన నేల.. దున్నిన దుక్కి.. పంట పండించిన పొలాన్ని ఆఖరి సారి కళ్లనిండా చూసుకుని అక్కడే.. ఏళ్ల నుంచి నీడనిస్తున్న చెట్టుకు ఉరి వేసుకుని ఊపిరొదిలాడు. తండ్రి మరణం గురించి తెలుసుకున్న ఆ రైతు తనయుడు అతణ్ని కడచూపు చూసుకోవడానికి అతడు ఉరి వేసుకున్న చోటుకు వెళ్లాడు. తండ్రి లేని బతుకు శూన్యం అనుకున్నాడో.. నాన్న నడిచిన బాటలోనే నడవాలనుకున్నాడో కానీ.. కుమారుడు కూడా అదే ప్రాంతంలో ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండలంలోని జాకారంలో చోటుచేసుకుంది.
జాకారానికి చెందిన ఉగ్గి అంజయ్య(53)కు మూడెకరాల పొలం ఉంది. భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు గ్రామంలోనే వ్యవసాయ పనులు చేస్తున్నారు. చిన్న కుమారుడు ప్రవీణ్ షాద్‌నగర్‌లో డిగ్రీ చదువుతున్నాడు. అంజయ్య తన పొలంతో పాటు మరికొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. అన్నదమ్ములతో భూ తగాదాల కారణంగా కొన్నేళ్లుగా ఆయన కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. రూ.5 లక్షల వరకూ అప్పులున్నాయి. ఈ నేపథ్యంలో అంజయ్య విరక్తి చెంది బుధవారం మధ్యాహ్నం పొలంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ (23) సాయంత్రం 4.30 గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. నేరుగా పొలానికి వెళ్లి తండ్రి ఉరి వేసుకున్న ప్రాంతంలోనే తానూ ఉరి వేసుకున్నాడు. చుట్టుపక్కల పొలాల వారు గమనించేసరికే అతడు మృతి చెందాడు. అంజయ్య భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.