"నాన్నా.. నేనేం తప్పు చేశాను..
నీ కలలకు ప్రతిరూపంగా జన్మించాను..
నీ చేయి పట్టుకొని నడవాలనుకున్నాను..
నీ మాటలు, ప్రేమానురాగాలే లోకమనుకున్నాను..
నాకు తెలియని కొంగొత్త ప్రపంచం పరిచయం చేస్తావనుకుంటే.. ఊహించని రీతిలో చావును పరిచయం చేశావు..
నా ప్రతీ అడుగులో తోడుంటావనుకుంటే.. తిరిగిరాని లోకాలకు తోడుగా తీసుకెళ్లావు..
ప్రాణంపోసిన నువ్వే.. నీ చేతులతోనే ఊపిరితీసేశావు..
ఎందుకు నాన్నా.. ఇలా చేశావు...? నేనేం తప్పుచేశాను.?"
.. ముద్దులొలికే ఆ చిన్నారి అంతర్మథనం ఇలాగే ఉంటుందేమో..!
ఏ తండ్రి చేయని.. చేయలేని.. పనిని చేశాడు. ఎంత కష్టమొచ్చినా.. ఆత్మహత్య చేసుకోవటమే నేరమని చెప్తుంటే.. అందులోనూ అభంశుభం తెలియని తన సొంత కుమారుని ప్రాణాలను చేజేతులారా తీయటం ఎలా సాధ్యపడిందో..? తన సర్వస్వం అర్పించైనా తన వంశాకురాన్ని కాపాడుకోవాలనుకునే తండ్రే.. తన కొడుకును చంపాడంటే.. ఆ క్షణం ఎంత క్షోభ అనుభవించాడో..?
"నన్ను క్షమించురా కన్నా..
నీకు ప్రాణం పోసిన నేనే.. నీ ప్రాణం తీస్తానని కళ్లో కూడా అనుకోలేదురా..
ఈ అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేయాలనుకున్న నా చేతులతోనే.. నిన్న జీవశ్చవాన్ని చేస్తున్నా..
తలకొరివిపెట్టి పున్నామనరకం నుంచి తప్పించేందుకు వచ్చిన నిన్ను.. నేనే మరణశయ్యపై పడుకోబెట్టాను..
నాన్న అని పిలిపించుకోకుండానే నిన్ను తుంచేస్తూ క్షమించరాని తప్పు చేస్తున్నా..
నన్ను క్షమించకురా.. బిడ్డా.."
తనకు ప్రతిరూపమైన పాలబుగ్గల పసివాని ప్రాణం తీసేటప్పుడు ఆ తండ్రి ఇలాగే గుండె ఎంత క్షోభ అనుభవించాడేమో..!
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన వినేశ్ (30)కు కుభీరు మండలం సాంవ్లి గ్రామానికి చెందిన సరితతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల అభిరామ్ అనే కుమారుడున్నాడు. గొర్రెలు కాస్తూ.. జీవనం సాగించే వినేశ్.. ఇటీవల అత్తవారింటికి వెళ్లాడు. ఈ నెల 21న కుమారుడిని తీసుకొని ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. ఇంటికి వెళ్తున్నారని అందరు భావించారు. కానీ.. ఇంటికి వెళ్లలేదు. సాయంత్రం వరకు చూసిన రాలేదు. ఎక్కడికి వెళ్లుంటారో కనుక్కుందామని.. ఫోన్ చేస్తే స్విఛ్ఛాఫ్ రావడంతో ఆందోళనకు గురయ్యారు.
తెలిసిన చోట్లల్లో వాకబు చేసినా ఫలితం లేకపోయింది. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నర్సాపూర్ (జి) మండలం నసీరాబాద్ అటవీప్రాంతంలో తండ్రికొడుకులిద్దరు విగతజీవులుగా కనిపించారు. రెండేళ్ల కుమారుడికి తొలుత ఉరివేసి చంపిన అనంతరం.. వినేశ్ కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తండ్రికొడుకులు ఇద్దరూ చనిపోవడంతో సాంవ్లి, కనకాపూర్ గ్రామాల్లో విషాదం నెలకొంది. ప్రాణం తీసుకునేంత కష్టం ఏమొచ్చింది..? అభంశుభం తెలియని చిన్నారిని ఎందుకు చంపేసి ఉంటాడు..? అన్న ప్రశ్నలు స్థానికులు, కుటుంబసభ్యుల మెదళ్లను తొలిచేస్తున్నాయి.
ఇదీ చూడండి: