ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు.. కానీ వేలాదిగా ఫాంహౌస్‌లు కట్టేశారు. జూదం నిర్వహించరాదు.. అయినా రాత్రిపగళ్లు రూ.కోట్లలో జూదం నడుస్తోంది. అసాంఘిక కార్యకలాపాలు నిషేధం.. కానీ వ్యభిచారంతో పాటు, మద్యం, డ్రగ్స్ యథేచ్ఛగా దొరుకుతున్నాయి.
భాగ్యనగరం చుట్టుపక్కల మండలాల్లో వెలసిన 25 వేల ఫాంహౌస్‌ల్లో మొయినాబాద్‌లో అయిదువేల వరకు ఉన్నాయి. శంషాబాద్‌లోనూ భారీగానే ఉన్నాయి. అలాగే గండిపేట చుట్టుపక్కల, షాద్‌నగర్, కొత్తూరు, నందిగామ, మహేశ్వరం, కీసర, శామీర్‌పేట, మేడ్చల్ తదితర మండలాల్లోనూ వెలిశాయి. మొయినాబాద్ మండలం పూర్తిగా, శంషాబాద్ మండలంలో ఒకట్రెండు గ్రామాలు తప్ప అన్నీ 111 జీవో పరిధిలోనే ఉన్నాయి. ఈ జీవో పరిధిలో ఉన్న ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. కనీసం గ్రామ పంచాయతీ అనుమతి లేకుండానే భారీ భవనాలు నిర్మించారు. పంచాయతీ నుంచి ఇంటి నంబరు తీసుకుని విద్యుత్తు కనెక్షన్ తీసుకుంటున్నారు. తర్వాత ఫాంహౌస్‌లు, రిసార్టులగాను తీర్చిదిద్దారు. వీటిలో 70 శాతం నిర్మాణాలకు అనుమతులు లేవని పంచాయతీ పాలకవర్గాలకు, పోలీసులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోరు. కారణం వాటిల్లో అధిక శాతం ప్రజాప్రతినిధులవో, స్థానికంగా పట్టున్న నాయకులవో కావడమే. ఫలితంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) వాటి జోలికి వెళ్లడంలేదు.
సకల సౌకర్యాలతో..
నగరానికి చెందిన ప్రముఖులు, నాయకులు శివారుల్లో వేలాది ఎకరాలను కొనుగోలు చేసి ప్రహరీలు నిర్మించి పచ్చని చెట్లను పెంచడంతోపాటు వ్యవసాయం చేస్తున్నారు. కొందరు ఫాంహౌస్‌ల నిర్మించారు. ఈత కొలనులు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తొలి రోజుల్లో వారాంతాల్లో కుటుంబసమేతంగా వెళ్లి హాయిగా గడిపేవారు. క్రమేపీ డిమాండ్ పెరగడంతో అద్దెకు ఇస్తున్నారు.
- 25 వేలు
శివారుల్లోని ఫాంహౌస్‌లు, రిసార్టులు
- 15 వేలు
నిషేధిత ప్రాంతాల్లో ఉన్నవి
- 70 శాతం
అనుమతి లేని నిర్మాణాలు
- అద్దె రోజుకు
రూ.25 వేల నుంచి రూ.75 వేలు