అటవీ అధికారులపై పెట్రోల్ పోసిన చెంచు రైతులు
15:05 July 02
అటవీ అధికారులపై పెట్రోల్ పోసిన చెంచు రైతులు
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో అటవీ అధికారులపై పెట్రోల్ పోసిన ఘటనలో ఐదుగురు చెంచులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాచారం గ్రామంలో పోడు భూముల విషయంలో అటవీ అధికారులకు, స్థానిక చెంచు రైతులకు కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఇంతకు ముందు నెల రోజుల క్రితం అటవీ అధికారులు చెంచు రైతులకు నోటీసులు ఇవ్వడానికి వచ్చినపుడు అటవీ అధికారుల వాహనానికి చెంచులు అడ్డంగా పడుకుని అడ్డుకున్నారు.
శుక్రవారం అమ్రాబాద్, మద్దిమడుగు రేంజ్ అటవీ అధికారులు మాచారంలో చెంచులు సాగు చేసుకుంటున్న అటవీ భూముల్లో మొక్కలు నాటడానికి సరిహద్దు లైన్ ఏర్పాటు చేస్తుండగా చెంచు రైతులు అక్కడికి చేరుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటే తాము ఎలా బతకాలని చెంచులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ భూములు అటవీ భూములని.. వీటికి ఎలాంటి హక్కు పత్రాలు లేవని అటవీ అధికారులు బదులిచ్చారు. దీంతో సహనం కోల్పోయిన ఓ చెంచు మహిళ అటవీ సెక్షన్ అధికారిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టేందుకు అగ్గి పెట్టెను వెతకడంతో స్థానికులు వారించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న విప్ గువ్వల బాలరాజు అక్కడికి చేరుకుని ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఇలా ఎవరూ ఘర్షణ పడవద్దని వివాదం సద్దుమణిగేలా చేశారు. అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు ఘటనలో పాల్గొన్న ఐదుగురు చెంచు రైతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమ్రాబాద్ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:TS -AP water war: 'అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోంది'