రుణ యాప్‌లకు సంబంధించి బ్యాంకు ఖాతాల్లోని కోటి రూపాయలకుపైగా విడుదల వెనుక ఎవరెవరు కీలకంగా వ్యవహరించారనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. మల్కాజ్‌గిరికి చెందిన అనీల్‌కుమార్ ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన సైబర్ క్రైం పోలీసులు... అతన్ని పట్టుకున్నారు. అనిల్ హైదరాబాద్ శివారులో కార్పొరేట్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆరేళ్ల క్రితం ముంబయి వెళ్లిన అనిల్... కొద్ది నెలలు అక్కడ ఉండి తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. మల్కాజిగిరిలోని తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. తరచూ ముంబయి వెళ్లేవాడు. అక్కడికి వెళ్లినప్పుడల్లా 50 వేలు, లక్ష రూపాయలతో తిరిగి వచ్చేవాడు. సైబర్ క్రైం పోలీసులు ఐదేళ్ల క్రితం అతన్ని అరెస్టు చేశాక నేరాలు చేస్తున్నాడని కుటుంబసభ్యులకు తెలిసింది.
Loan App Case: నకిలీ సైబర్ క్రైం ఎస్సై వ్యవహారంలో కొత్త విషయాలు - loan app case latest news
రుణ యాప్‌ల కేసులో సంస్థల బ్యాంకు ఖాతాల్లోని కోటి రూపాయలకుపైగా విడుదల చేయించిన నకిలీ సైబర్ క్రైం ఎస్‌ఐ వ్యవహారంలో.... కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అసలు ఎవరి ఆదేశాలతో డబ్బులు విడుదల చేయించాడు...? నిధులు ఏయే ఖాతాల్లోకి మళ్లించాడనే అంశాలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు.
అనిల్... సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు తెరిచి సహకరించేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. జైలు నుంచి విడుదలయ్యాక తిరిగి ముంబయి వెళ్లాడు. అక్కడ ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె కూడా సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను సమకూర్చుతోంది. ఇద్దరూ కలిసి ముంబయి శివారులో గది అద్దెకు తీసుకుని కొంతకాలం నివసించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కోటి రూపాయలకుపైగా మళ్లించిన వ్యవహారంలో ముంబయి మహిళ పాత్రతో పాటు మరికొందరు నైజీరియన్ల పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
నిందితుడు అనిల్‌ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.