వికారాబాద్ జిల్లాలో ఓ పెళ్లి ఇంట తీరని విషాదం అలుముకుంది. కొత్తజంట ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో వరుడు, అతని అక్క ప్రాణాలతో బయటపడగా.. నవ వధువు సహా వరుడి మరో అక్క మృతదేహం 4 కిలోమీటర్ల దూరంలో లభ్యమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వరుడి మేనల్లుడు, డ్రైవర్ గల్లంతయ్యారు. అయితే గల్లంతైన డ్రైవర్ బతికే ఉన్నాడని పోలీసులు తెలిపారు. వరుడి మేనల్లుడి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోమిన్‌పేట-మర్పల్లి మండలాల మధ్య తిమ్మాపూర్ వద్ద నిన్న రాత్రి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ఆ దారిలో వెళ్తున్న కారు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఘటనలో ఓ నవ వధువు సహా మరో ముగ్గురు గల్లంతయ్యారు.
రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డి అనే వ్యక్తికి మోమిన్‌పేటకు చెందిన ప్రవల్లికతో ఈ నెల 26న వివాహం జరిగింది. విందు కోసం మోమిన్‌పేటకు వెళ్లిన కుటుంబసభ్యులు.. వేడుకలు పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కారులో కొత్తజంట నవాజ్‌రెడ్డి, ప్రవల్లికతోపాటు నవాజ్‌రెడ్డి అక్కలు శ్వేత, రాధమ్మ, శ్వేత కుమారుడు త్రిశాంత్రెడ్డి ఉన్నారు. నవాజ్‌రెడ్డి బంధువు రాఘవేందర్ రెడ్డి కారు నడుపుతున్నాడు. ఇంకా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం ఉండగా తిమ్మాపూర్ వద్ద కల్వర్టుపై వాగు ఉప్పొంగింది. అయితే వాగు ఉద్ధృతిని తేలిగ్గా తీసుకున్న డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి.. కారును ముందుకుపోనిచ్చారు. కల్వర్టు మధ్యలో ఒక్కసారిగా కారు ఆగిపోయింది. వరద ఉద్ధృతి మరింత పెరగడంతో కారు వాగులోకి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో నవాజ్రెడ్డితోపాటు అతని పెద్ద అక్క రాధమ్మ సురక్షితంగా బయటపడగా.. నవాజ్‌రెడ్డి మరో సోదరి శ్వేత, ఆమె కుమారుడు త్రిశాంత్రెడ్డి, నవ వధువు ప్రవల్లిక, డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి గల్లంతయ్యారు.