సమాజానికి చేటు చేసే గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తోందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇవాళ ఉదయం హైదరాబాద్లో పట్టుకున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలో కీలక సూత్రధారులు అయిన వికాస్, సుభాశ్లు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
CP Stephen on Drugs Gang Arrest : గంజాయి తరలింపు ముఠా అరెస్టు.. పరారీలో సూత్రధారులు
రాష్ట్రంలో గంజాయి సరఫరాను కట్టడి చేసేందుకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇవాళ ఉదయం 800 కిలోల గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో సూత్రధారులైన వికాస్, సుభాశ్లు పరారీలో ఉన్నారని.. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు చెప్పారు.
'ఇవాళ ఉదయం విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గంజాయి తరలింపును కట్టడి చేయడానికి శంషాబాద్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.1.80 కోట్లు విలువ చేసే 800 కిలోల గంజాయిని పట్టుకున్నారు. అల్లం రవాణా చేస్తున్న లారీల్లో గాంజాను సరఫరా చేశారు.' - స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ
రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సరఫరాను కట్టడి చేయడానికి పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని సీపీ స్టీఫెన్ తెలిపారు. ముఖ్యంగా వీటి బారిన పడుతోంది యువతేనని.. కొంత మంది సరఫరాదారులుగా కూడా మారుతున్నారని చెప్పారు. డ్రగ్స్, గంజాయి విక్రయించినా.. సరఫరా చేసినా.. వినియోగించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.