తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cryptocurrency: అత్యాశే పెట్టుబడిగా సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు - క్రిప్టో కరెన్సీ వార్తలు

జనం అమాయకత్వం, అత్యాశే పెట్టుబడిగా సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అధిక లాభాలు ఆశచూపి కోట్లు కొల్లగొడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చంటూ.. కేటుగాళ్లు పన్నుతున్న వలకు చిక్కి అనేక మంది లక్షల్లో నగదు పోగొట్టుకుని గొల్లుమంటున్నారు.

Cryptocurrency
Cryptocurrency

By

Published : Nov 7, 2021, 5:27 AM IST

అధిక లాభాలు అంటూ ఆశచూపుతారు.. ముందుగా పెట్టుబడులకు కొంత మొత్తం లాభాలు అందించి ఎరవేస్తారు. అది నమ్మి అధిక పెట్టుబడులు పెట్టాక.. ముఖం చాటేస్తారు. క్రిప్టో కరెన్సీ, బిట్‌ కాయిన్లతో కోటీశ్వరులు కావొచ్చంటూ.. ఇటీవల సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు.

సిట్టింగ్‌లోనే 33 లక్షలు..

హైదరాబాద్‌లో ఈ తరహాలో అనేక సైబర్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల పలు కేసులు నమోదు కాగా రాచకొండ పోలీసులు పశ్చిమ బంగాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల ఖాతాల్లోని రూ.50 లక్షల నగదు నిలుపుదల చేశారు. ఇటీవల 25 కేసులకు సంబంధించి నిందితుడిని తీసుకురాగా... ఒక్క సిట్టింగ్‌లోనే 33 లక్షలు చెల్లించాడని పోలీసులు తెలిపారు. అంటే వారి మోసాల వ్యాపారం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

భారీ లాభాలొస్తాయని నమ్మించి..

ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో ప్రకటనలు ఇస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఎదుటి వ్యక్తులను నమ్మించడానికి పలు డొల్ల కంపెనీలను సృష్టిస్తున్నారు. అమాయకుల గుర్తింపు కార్డులు తీసుకొని వాళ్ల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. సిమ్ కార్డులు సైతం తీసుకుంటున్నారు. యాప్‌లు సృష్టించి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలొస్తాయని నమ్మిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ముందస్తు జాగ్రత్తగా వర్చువల్ నంబర్లతో ఫోన్లు చేస్తున్నారు. ఎదుటి వ్యక్తులను నమ్మించేందుకు మొదట కొంత డబ్బులు లాభంగా తిరిగి ఇచ్చేస్తున్నారు. అలా ముగ్గులోకి దింపి లక్షల్లో నగదు వసూలు చేశాక.. బిస్తరు చుట్టేస్తున్నారు. తక్కువ కాలంలో కోటీశ్వరులైపోదామనే ఆశతో ప్రజలు అలాంటి వారి వలకు చిక్కొద్దని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని ఫోన్‌కాల్స్‌, గుర్తింపు లేని యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీచూడండి:Cryptocurrency: క్రిప్టో కరెన్సీ పేరిట మోసం... రూ.86 లక్షలు టోకరా

ABOUT THE AUTHOR

...view details