fake mbbs registrations: రాష్ట్రంలో కలకలం సృష్టించిన నకిలీ వైద్యుల రిజిస్ట్రేషన్ కేసు విచారణను సైబర్ క్రైం పోలీసులు వేగవంతం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. నకిలీ పట్టాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని నోటీసుల్లో వెల్లడించారు. ఎంబీబీఎస్ నమోదు ప్రక్రియకు సంబంధించిన రిజిస్టర్లతో పాటు సర్వర్లను సైతం సైబర్ క్రైం పోలీసులు తనిఖీ చేయనున్నారు.
medical council: 2016లో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో రామ్‌రెడ్డి, శ్రీనివాస్, నాగమణి, శ్రీనివాస్ రెడ్డి అనే నలుగురు రిజిస్టర్ చేసుకున్నారు. దీన్ని ఐదేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రెండు నెలల క్రితం నలుగురు వైద్యులు మరోసారి రిజిస్టర్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ల సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. అదే రిజిస్ట్రేషన్ నెంబర్‌పై ఇతరుల పేర్లను గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని మెడికల్ కౌన్సిల్ అధికారులు రిజిస్ట్రార్ హనుమంత్ రావు దృష్టికి తీసుకెళ్లారు.
ఒకరి పేరుతో మరొకరికి అనుమతి
ఒకరి రిజిస్ట్రేషన్ నెంబర్‌తో మరొకరు అనుమతి తీసుకున్నట్లు గుర్తించిన హనుమంత్ రావు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు మెడికల్ కౌన్సిల్‌లో నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి రిజిస్టర్ చేయించుకున్న ఓ వ్యక్తి కర్నూలులో ఆస్పత్రి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పుడు వీళ్లందరిని పిలిపించి సర్టిఫికెట్లను పోలీసులు పరిశీలించనున్నారు. నకిలీ ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ ఘటనలో మెడికల్ కౌన్సిల్ సిబ్బంది హస్తం ఉండొచ్చని సైబర్ క్రైం పోలీసులు అనుమానిస్తున్నారు. అవసరమైతే సంబంధిత అధికారులు, సిబ్బందిని సైతం సైబర్ క్రైం పోలీసులు ప్రశ్నించనున్నారు.
అర్హత సాధించలేక అడ్డదారులు
దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు మెడికల్ కౌన్సిల్‌లో సంబంధిత పత్రాలు చూపించి దరఖాస్తు చేసుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు. ఇక్కడ ఎంబీబీఎస్ సీటు రాని విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకుంటున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు మన దేశంలో నేరుగా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. మెడికల్ కౌన్సిల్ నిర్వహించే పరీక్షలో అర్హత సాధించిన తర్వాత ఆ సర్టిఫికెట్‌ను జతపరిస్తేనే రిజిస్ట్రేషన్ నెంబర్ లభిస్తుంది. మెడికల్ కౌన్సిల్‌లో అర్హత సాధించలేని వాళ్లు ఇలా అడ్డదారుల్లో ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ నెంబర్ పొందుతున్నారని సైబర్ క్రైం పోలీసులు భావిస్తున్నారు. ఆర్ఎంపీలు, పలు ఆస్పత్రుల్లో వైద్యులకు అసిస్టెంట్లుగా పనిచేసే వాళ్లు దొడ్డి దారిలో మెడికల్ కౌన్సిల్‌లో నకిలీ రిజిస్ట్రేషన్లు సంపాదిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాంరెడ్డి, శ్రీనివాస్, నాగమణి, శ్రీనివాస్ రెడ్డిల పేరుతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తీసుకున్న వైద్యుల్లో ఒకరు కర్నూలులో ఆస్పత్రి నిర్వహిస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు తేలింది. వీళ్లంతా విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేశారా లేకపోతే ఆర్ఎంపీలుగా అనుభవం సంపాదించి వైద్యులుగా చెలామణి అయ్యేందుకు రిజిస్ట్రేషన్ నెంబర్లు తీసుకున్నారా అనే విషయాలను పోలీసులు సేకరిస్తున్నారు. కొంతమంది వైద్యవిద్య పూర్తి చేయలేక అడ్డదారిలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు.
ప్రాణాలతో చెలగాటం