సైబర్ కేటుగాళ్లు రోజురోజుకూ విజృంభిస్తున్నారు. ఓ మహిళ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులనూ కాజేశారు. తన ఖాతాలో డబ్బులు తగ్గుతున్నాయని ఫిర్యాదు చేసేందుకు ఆన్లైన్లో శోధించినట్లు బాధితురాలు తెలిపారు. ఆన్లైన్ ఫిర్యాదు చేయగా యెనో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి... ఖాతాలో ఉన్న రూ.4,20,000 దోచేసినట్లు వాపోయారు. మోసపోయానని తెలుసుకున్న బాధిత మహిళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులనాశ్రయించారు.
సైబర్ మోసం: గూగుల్ చేస్తే చాలు.. మాయం చేస్తున్నారు!
సైబర్ మోసగాళ్లు రోజుకో రూటు మారుస్తున్నారు. ఏదైనా సమస్య వచ్చి బాధితులు గూగుల్ చేస్తే చాలు అదే అదునుగా భావిస్తున్నారు. కస్టమర్ కేర్ అంటూ కాల్ చేసి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు ఇద్దరు బాధితులు.
మరో కేసులో జియో లక్కీ డ్రా పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తిని మోసం చేశారు. జియో మొబైల్ లక్కీ డ్రాలో రూ.25లక్షల గెలిచారంటూ కాల్ చేసినట్లు బాధితుడు తెలిపారు. ఆ డబ్బులు ఇవ్వాలంటే వివిధ ఛార్జీల పేరుతో రూ.6 లక్షలను దండుకున్నారని వాపోయారు. మోసపోయానని తెలుసుకున్న హైదరాబాద్ నల్లకుంటకి చెందిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పై రెండు ఘటనల్లో కేసు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.
ఇదీ చదవండి:పోలీసులే ఖంగుతినేలా చేసిన సైకో కిల్లర్.. ఏం జరిగిందంటే?