ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ వేసిన నార్కో పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. సునీల్ యాదవ్‌కు నార్కో పరీక్షలకు అనుమతించాలని సీబీఐ వేసిన పిటిషన్‌పై.. జమ్మలమడుగు కోర్టు మేజిస్ట్రేట్ విచారణ జరిపింది. కడప జైలు నుంచి వర్చువల్‌గా సునీల్ యాదవ్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నార్కో పరీక్షలకు సమ్మతమేనా అని మేజిస్ట్రేట్.. సునీల్‌ను ప్రశ్నించింది. ఇందుకు బదులుగా తాను నార్కో పరీక్షలకు సమ్మతం కాదని సునీల్ యాదవ్ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. సీబీఐ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.
సీబీఐ పిటిషన్ ఏంటంటే..?
వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్‌ను కీలక వ్యక్తిగా భావిస్తోంది సీబీఐ. అతడిని విచారిస్తే అసలు విషయం బయటికి వస్తుందని భావించిన అధికారులు.. ఆగస్టు 18వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సునీల్‌కు నార్కో పరీక్షలకు అనుమతివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జమ్మలమడుగు కోర్టులో వాదనలు జరిగాయి. ఆగస్టు 27న మరోసారి వాదనలు విన్న కోర్టు... సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. ఇవాళ ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. సీబీఐ వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
గోవాలో అరెస్ట్..
వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆగస్టు 2న గోవాలో సునీల్ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ ధ్రువీకరించింది. ఈనెల 3న సునీల్‌ను గోవా స్థానిక కోర్టులో హజరుపరిచిన సీబీఐ అధికారులు ట్రాన్సిట్ రిమాండ్‌లోకి తీసుకున్నారు. అనంతరం కడప కోర్టులో హాజరుపరిచిన అధికారులు.. జైలుకు తరలించారు.