ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్ల దొంగతనాలు చేస్తున్న ముఠాను హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీసీఎస్, కందుకూరు పోలీసులు, ఎల్బీనగర్ నగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 18 లక్షల నగదు, 160 కిలోల కాపర్ వైర్, నాలుగు ద్విచక్రవాహనాలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా వీటన్నింటి విలువ రూ. 25లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
నిందితులు నందులాల్ రాజ్బర్, అభిమాన్యు రాజ్బర్ ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ తెలిపారు. మరో ఇద్దరు నిందితులైన సహదేవ్, రాహుల్ రాజ్బర్ పరారీలో ఉన్నట్లు వివరించారు. మిగితా ఇద్దరిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
వీళ్లు ఏం చేస్తారంటే..?
"నలుగురు నిందితులు ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో నివాసముంటున్నారు. వీళ్లు ఉదయం పూట ఐసోలేటెడ్ ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేసి.. రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి పూట వెళ్లి కర్రతో కొట్టి కరెంట్ ఆపేస్తారు. ఒక 15 నుంచి 20 నిమిషాలు ఎవరైనా వస్తున్నారా లేదా అని వేచి ఉంటారు. ఎవరు రావట్లేదని నిర్ధరించుకుని ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్‌ను తీసుకుంటారు. అక్కడికి దగ్గరలోని నిర్మానుష్య ప్రాంతంలో దాచి పెడతారు. తర్వాతి రోజు మళ్లీ వెళ్లి.. ఆ కాపర్‌వైర్‌ను స్క్రాప్ దుకాణంలో కానీ... మిగతా వాళ్లకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఈక్రమంలో నిందితులు ఏకంగా 196 ట్రాన్స్ఫార్మర్లను పాడుచేసినట్టు తేలింది." -మహేశ్ భగవత్, రాచకొండ సీపీ