ఏపీలోని చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం సామకోటవారిపల్లె సర్పంచ్ అభ్యర్థి ఓబుల్‌రెడ్డిని గురువారం వేకువజామున అపహరించి.. ఆపై రాత్రి పది గంటల సమయంలో వాహనంలో తీసుకువచ్చి గ్రామ సమీపంలో బస్టాపు వద్ద వాహనం నుంచి దించి వెళ్లారు. సమీపంలోని ఓ ఇంటికి వెళ్లి తన కష్టాన్ని వివరించడంతో పాటు బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్థులు చేరుకుని అపహరణ విషయం తెలుసుకున్నారు. తెదేపా నేతలు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో తన అపహరణ విషయాన్ని బయటపెట్టారు.
ఓబుల్‌రెడ్డి సర్పంచ్ పదవికి నామినేషన్ వేయకుండా అడ్డుకోవడంలో భాగంగా కిడ్నాప్ చేశారు. సామకోటవారిపల్లె సర్పంచ్ పదవికి తెదేపా మద్దతుతో ఓబులురెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. గురువారం ఉదయం నామినేషన్ వేయడానికి బుధవారం రాత్రి వరకు ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు ఇంటింటి ప్రచారం చేపట్టారు. గురువారం తెల్లవారు జామున 3.30 గంటలకు పోలీసుల పేరిట ఇంటి తలుపు తట్టగా ద్వారం తెరిచారు. అనంతరం నలుగురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని ముసుగు ధరించి తీసుకెళ్లారు. పగలంతా కారులో తిప్పారు. కనీసం మంచి నీరు కూడా ఇవ్వలేదు. అపహరించిన వ్యక్తులు గుర్తుపట్టని విధంగా వ్యవహరించారని వివరించారు.