పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ సమీపంలోని గాడిదలగండి గుట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెల్లంపల్లి నుంచి హనుమకొండకు వెళ్తున్న పరకాల డిపో బస్సు కారును ఢీకొని అదుపు తప్పి రోడ్డు పక్కన లోయలో పడింది. ప్రమాదంలో కారు డ్రైవర్ వినీత్ అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్, కండక్టర్ సహా బస్సులోని 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మందమర్రి గ్రామానికి చెందిన మరియమ్మ, భూపాలపల్లి వాసి లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు మంథని ఆస్పత్రిలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ , గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు.
కారును ఢీకొని లోయలో పడిన బస్సు... ఒకరు మృతి... 13 మందికి గాయాలు - telangana varthalu
08:29 October 06
కారును ఢీకొని లోయలో పడిన బస్సు... ఒకరు మృతి... 13 మందికి గాయాలు
ఉదయం 8 గంటల సమయంలో పరకాల డిపోకి చెందిన బస్సు.. మంథని నుంచి బయలుదేరింది. ఎక్లాస్పూర్ వద్దకు రాగానే... భూపాలపల్లి నుంచి వస్తున్న ఓ కారు బస్సుకు ఎదురుగా వచ్చింది. ప్రమాదాన్ని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా.... అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు తుక్కుతుక్కు అయ్యింది. కారు డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ లౌడియా గోవర్ధన్ చేతికి తీవ్రగాయాలు కాగా.. అతన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి
పరకాల డిపో బస్సు లోయలో పడిన ఘటనపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెల్లంపల్లి నుంచి హన్మకొండ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడటం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తంచేశారు. గాయపడిన ప్రయాణీకులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్, వరంగల్ రీజినల్ మేనేజర్లను మంత్రి అజయ్ ఆదేశించారు. క్షతగాత్రులకు కావాల్సిన వైద్య సేవల కోసం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి :రోడ్డు ప్రమాద బాధితుల సమాచారం ఇస్తే పారితోషికం!