మత్తుకు బానిస అవుతున్న బాల్యం Children are consuming whitener: భాగ్యనగరంలో ఇటీవల వెలుగులోకి వస్తున్న మాదకద్రవ్యాల ఘటనలు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. మత్తుమైకంలో యువత జీవితాలు నాశనం చేసుకుంటుండగా.. ధనార్జనే లక్ష్యంగా కొందరు వీటిని సరఫరా చేస్తూ సమాజాన్ని చీడలా పట్టిపీడిస్తున్నారు. ఉగాది పండుగ రోజు అర్ధరాత్రి దాటాక బంజారాహిల్స్‌లోని పబ్‌లో వివిధ రకాల డ్రగ్స్ పట్టుబడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అంతే కాకుండా నగరం నలువైపులా రహదారులపై నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ ఎత్తున గంజాయి దొరకడం.. రాష్ట్రాన్ని మత్తు ఎలా పట్టిపీడుస్తోందో అర్థమవుతోంది.
పెడదారి పట్టి:బీటెక్ చదివిన ఓ యువకుడు డ్రగ్స్‌కు బానిసై.. చివరికి డబ్బు కోసం ఆ డ్రగ్‌నే తయారు చేయడం నేర్చుకున్నాడు. ఒక్కగ్రామ్తో 20 మందికి కిక్కిచ్చేలా దాన్ని రూపొందించాడు. వ్యక్తిగతంగా, సమాజానికి ఉపయోగపడేలా తన ప్రతిభను ఉపయోగించాల్సిన ఈ యువకుడు.. మత్తు తయారీకి వినియోగించి చివరకు కటకటాలపాలయ్యాడు. ఉన్నతాధికారుల పిల్లలు సైతం ఈ వ్యాపారంలో ఉన్నారంటే.. యువతపై డ్రగ్స్ ప్రభావం ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు.
నషా ఎక్కుతుందని: ఇదిలా ఉంటే... కొందరు చిన్నారులు సైతం ఈ దారులను వెతుకుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా హైదరాబాద్ విజయనగర్ కాలనీలో కొందరు చిన్నారులు ఒకచోట చేరి.. వైట్నర్ సేవిస్తుండటం కలకలంరేపింది. నిండా పదేళ్లయినా లేని ఈ పిల్లలు గుంపులుగా చేరి మద్యం, వైట్నర్ సేవిస్తున్నారు. ఈ పిల్లల వద్దకు వెళ్లి.. ఏమిటదని ప్రశ్నించగా వైట్నర్ అంటూ ఏ మాత్రం జంకులేకుండా సమాధానం చెప్పారు. ఎక్కడ నుంచి కొనుగోలు చేశారని ప్రశ్నించగా.. మల్లేపల్లి, ఆసీఫ్‌నగర్, గోషామహల్ ప్రాంతాల్లో ఇది దొరుకుతుందని పేర్కొన్నారు. ఇది తాగితే ఏవుతుందని అడగ్గా.. నషా ఎక్కుతుందని బదులిచ్చారు.
పోలీసుల కంటపడటం లేదా?: లేలేత ప్రాయంలో అదీ బహిరంగ ప్రదేశంలో వీరంతా వైట్నర్ సేవిస్తుండటాన్ని చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. కాలనీలో ఇంత జరుగుతున్నా పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులకు ఇది కంటపడటం లేదా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు ఇలాంటి వాటి పైన దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలోనూ మద్యానికి అలవాటైన కొందరు రోడ్డు పక్కన పడి ఉన్న శానిటైజర్, మత్తు కోసం వైట్నర్ సేవించిన ఘటనలో వార్తల్లోకెక్కిన ఘటనలో ఆందోళనకు గురిచేశాయి.
ఇదీ చదవండి: హాష్ ఆయిల్ : మత్తు కాదు.. అంతకుమించి