అధిక వడ్డీ ఇస్తామని పలువురి నుంచి డబ్బు తీసుకుని మోసాలకు పాల్పడిన శిల్పాచౌదరి బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే నార్సింగి ఠాణాలో ఓ కేసులో ఆరెస్ట్ అయి జైల్లో ఉన్న వీరిపై అదే ఠాణాలో మరో కేసు నమోదైంది. తన వద్ద రూ.2.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ప్రియా అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ పిల్లల వివాహం కోసం దాచుకున్న డబ్బును అధిక వడ్డీ ఆశతో శిల్పకు ఇచ్చామని బాధిత మహిళ తెలిపింది. గత రెండు ఏళ్ల నుంచి వడ్డీ కట్టలేదని... డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొంది.
బాధితులు ఇంకెందరో..
ఇదిలా ఉంటే ఒక్క నార్సింగి పరిధిలోనే సుమారు 10 కోట్ల మోసానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. నగర వ్యాప్తంగా ఈమె బాధితులు ఉన్నారని.. మొత్తం 70కోట్లకు పైగా మోసం చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖుల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు శిల్పాచౌదరి బాధితుల జాబితాలో ఉన్నారు. హంగూ.. ఆర్భాటం ప్రదర్శిస్తూ పలువురు ప్రముఖులను బుట్టలో వేసుకొని రూ.కోట్లలో బురిడీ కొట్టించారా కిలాడీ దంపతులు. స్థిరాస్తి వ్యాపారంలో లాభాలిస్తామంటూ ప్రముఖుల నుంచి భారీగా వసూలు చేశారు. అడిగేందుకు వెళితే బెదిరింపులకు దిగారు. ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వీరి మరో మాయనాటకం వెలుగుచూసింది. బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని కోరారు.
ఆర్భాటాల కోటకట్టి.. రూ.కోట్లు మూటగట్టి!
రంగారెడ్డి జిల్లా గండిపేట సిగ్నేచర్ విల్లాస్‌లో జెల్లా శిల్ప అలియాస్ శిల్పాచౌదరి, కృష్ణశ్రీనివాసప్రసాద్ దంపతులు నివసిస్తున్నారు. సినిమా నిర్మాణం, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నామంటూ ఆమె ప్రచారం చేసుకునేది. దంపతులిద్దరూ కలిసి తాజాగా సహేరి సినిమా తీశారు. వివాదాల్లో ఉండటంతో విడుదల కాలేదు. తమ హంగూ ఆర్భాటాలతో నగరంలో వ్యాపారవర్గాలకు చెందిన సుమారు 20 మంది మహిళలతో శిల్పాచౌదరి తరచూ కిట్టీ పార్టీలు ఏర్పాటు చేసేది. ఆమె ఉచ్చులో చిక్కిన మహిళలకు లాభాల ఆశచూపి భారీగా డబ్బు వసూలు చేసింది.
అధిక వడ్డీ ఆశ చూపి..
లాభాలు వస్తే వాటాలు ఇస్తామని, నష్టాలు వస్తే తీసుకున్న డబ్బుకు వడ్డీ కలిపి ఇస్తానంటూ నమ్మకం కలిగించింది. నిజమని భావించి పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి రూ.1.05 కోట్లు, మంచిరేవులకు చెందిన రోహిణి రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చారు. నెలల గడుస్తున్నా అసలు, వడ్డీ చేతికి రాకపోవటం, ఫోన్లకు స్పందించకపోవడంతో దివ్యారెడ్డి ఈనెల 8న శిల్పాచౌదరి ఇంటికి వెళ్లారు. తానిచ్చిన డబ్బు తిరిగివ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. శిల్ప తన వద్దనున్న బౌన్సర్లతో ఆమెను బెదిరించింది. ఈమేరకు బాధితురాలు నార్సింగి ఠాణాలో ఫిర్యాదు చేయటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం శిల్ప దంపతులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున న్యాయస్థానం దంపతులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
సంబంధిత కథనం:
Shilpa Fraud: పార్టీలు ఇచ్చి ఆకర్షించి.. కోట్లలో వసూలు చేసి..