loan app case: చైనా రుణ యాప్‌ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఫెమా ఉల్లంఘనల కింద క్యాష్ బిన్ రుణ యాప్ నిర్వాహకులకు చెందిన మరో 51 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రుణ యాప్‌లను నిర్వహించే బ్యాంకింగేతర సంస్థ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను చైనా జాతీయులు చేజిక్కించుకొని.. హవాలా దందా నడిపించినట్లు ఈడీ వెల్లడించింది. బోగస్ సాఫ్ట్వేర్ ఎగుమతుల పేరిట సుమారు 429 కోట్లను విదేశాలకు మళ్లించినట్లు పేర్కొంది. ఈడీ విచారణ ఆధారంగా ఆర్బీఐ, ఆదాయపన్ను శాఖ కూడా రంగంలోకి దిగింది.
loan app case: మళ్లీ తెర మీదికి రుణ యాప్‌ల కేసు.. మరో రూ.51 కోట్ల ఆస్తులు అటాచ్ - online loan app case
18:51 December 15
loan app case: మళ్లీ తెర మీదికి రుణ యాప్‌ల కేసు.. మరో రూ.51 కోట్ల ఆస్తులు అటాచ్
రుణ యాప్‌ల కేసులో ఆస్తుల జప్తు విలువ 289 కోట్ల రూపాయలకు చేరింది. క్యాష్ బిన్ మొబైల్ యాప్ ద్వారా రుణాలు ఇచ్చిన బ్యాంకింగేతర ఫిన్ టెక్ కంపెనీ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన మరో 51 కోట్ల రూపాయలను ఈడీ అటాచ్ చేసింది. గతంలో ఇదే సంస్థకు చెందిన 238 కోట్లను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. మన దేశానికి చెందిన ఫైనాన్స్ కంపెనీలను చైనీయులు చేజిక్కించుకొని.. రుణాల పేరిట వేధింపులకు గురి చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణలో తేలింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా ఆర్బీఐ నుంచి 2002లో అనుమతి పొందిన పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను 2018లో చైనా జాతీయుడు జో యాహుయ్ బినామీ సంస్థల ద్వారా చేజిక్కించుకున్నట్లు ఈడీ పేర్కొంది.
పూర్తిగా చైనీయుల అధీనంలో ఉన్న పీసీఎఫ్ఎస్... క్యాష్ బిన్ యాప్ ద్వారా అధిక రుణాలు ఇచ్చింది. రుణాల ద్వారా అందిన సొమ్మును దొడ్డి దారిన విదేశాలకు తరలించినట్లు ఈడీ పేర్కొంది. రుణాల ద్వారా ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ములో సుమారు 429 కోట్ల రూపాయలను బోగస్ సాఫ్ట్వేర్ ఎగుమతుల నెపంతో దేశం దాటించినట్లు తేలింది. చైనా, హాంకాంగ్, తైవాన్, అమెరికా, సింగపూర్‌లోని 13 సంస్థల పేరిట పీసీఎఫ్ఎస్ సొమ్ము మళ్లించిందని ఈడీ తెలిపింది. రుణాల కోసం విదేశాల నుంచి అక్రమంగా 173 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు పీసీఎఫ్‌ఎస్‌లోకి వచ్చినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈడీ దర్యాప్తు ఆధారంగా ఆర్బీఐ, ఆదాయపన్ను శాఖ కూడా విచారణ ప్రారంభించాయి.
ఇవీ చూడండి: