కామారెడ్డి మున్సిపాలిటీలోని బర్కత్‌పురా కాలనీకి చెందిన వివాహిత హత్యాయత్నం ఘటన కీలక మలుపు తిరిగింది. తొలుత గుర్తుతెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని బాధితురాలు చెప్పారు. అయితే కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమెపై దాడి జరగలేదని చెప్పారు. బ్లేడుతో వివాహితే గొంతు కోసుకున్నట్లు పోలీసులు నిర్ధరించారు. తొలుత హత్యాయత్నంగా నమ్మించడానికి యత్నించినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఇంట్లో పనులు చేస్తూ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.
Suicide Attempt: గొంతు కోసేసుకుంది.. ఎవరో కోసేశారని నమ్మించాలని చూసింది!
09:23 August 31
Murder attempt: గొంతు కోసుకున్న వివాహిత.. హత్యాయత్నంగా చిత్రీకరించే ప్రయత్నం!
మంగళవారం ఉదయం 7 గంటలకు ఇంటి పనులు చేసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తి గొంతు కోసినట్టుగా బాధితురాలు తెలిపారు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు గమనించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా 2 నెలల క్రితం కూడా బాధితురాలు ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. 9 నెలల క్రితం కామారెడ్డి యువకుడితో ఆమెకు వివాహం జరిగిందని చెప్పారు. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
దర్యాప్తు ముమ్మరం
డీఎస్పీ సోమనాథం బాధితురాలితో మాట్లాడారు. ఆమె ఇంటి వద్ద పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి... డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేయించారు. ఇంటిముందు ఉన్న డ్రైనేజీలో దొరికిన బ్లేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామన్నారు. బాధితురాలు గతంలోనూ చున్నీతో ఆత్మహత్యకు యత్నించి... ఎవరో గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించారని అబద్ధం చెప్పిందని విచారణలో వెల్లడైందన్నారు. కుటుంబ సభ్యుల సమస్యలు ఏవైనా ఉన్నాయా? లేక బాధితురాలికి ఇతర సమస్యలు ఉన్నాయా? మూడో వ్యక్తి వచ్చి దాడి చేశారా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వివరించారు.
ఇదీ చదవండి:RTC Bus Wrecked: చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు