తెలంగాణ

telangana

ETV Bharat / crime

accident: ఉద్యోగంలో చేరిన కొద్ది గంటల్లోనే ప్రమాదం.. భార్య మృతి, భర్తకు గాయాలు - ఏపీ వార్తలు

ఏపీలోని నందిగామ సమీపంలోని రామన్నపేట అడ్డ రోడ్డు వద్ద జాతీయ రహదారి పక్కనున్న ఇనుప రైలింగ్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల భార్యకు ఉద్యోగం వచ్చింది. విధుల్లో చేరేందుకు ఇద్దరూ ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది.

accident
accident

By

Published : Oct 17, 2021, 5:27 PM IST

వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల భార్యకు ఉద్యోగం వచ్చింది. విధుల్లో చేరేందుకు ఇద్దరూ ద్విచక్రవాహనంపై వెళ్లారు. ఆ పని పూర్తయ్యాక ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యారు. వారి ఆనందం అంతలోనే ఆవిరైంది. రోడ్డు ప్రమాదానికి గురై భార్య మృతి చెందగా.. భర్త తీవ్ర గాయాలపాలైన ఘటన ఏపీలోని నందిగామ సమీపంలో చోటుచేసుకుంది.

కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన వేముల మారుతీరావు, తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన కాల్వ సావిత్రి(33) కొన్నేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌లో విద్యుత్తు శాఖలో జూనియర్‌ లైన్‌మెన్‌గా ఆమెకు ఉద్యోగం రావడంతో ఈ నెల 14న విధుల్లో చేరేందుకు ఇద్దరూ ద్విచక్రవాహనంపై వెళ్లారు.

ఆమె ఉద్యోగంలో చేరిన అనంతరం అదే రోజు తిరిగి పరిటాల బయలు దేరారు. ఈనెల 15వ తేదీ తెల్లవారుజాము 2 గంటల సమయంలో నందిగామ సమీపంలోని రామన్నపేట అడ్డ రోడ్డు వద్ద జాతీయ రహదారి పక్కనున్న ఇనుప రైలింగ్‌ను వాహనం ఢీకొట్టింది. బైక్‌ వెనుక కూర్చున్న ఆమె తల రైలింగ్‌కు బలంగా తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కొద్దిసేపటికే మృతి చెందింది. మారుతీరావుకు కూడా తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:Road Accident: బైక్‌ను ఢీకొన్న లారీ.. తల్లీ, కుమారుడు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details