Fraud Swamiji in Kammadanam: క్షుద్రపూజల పేరుతో అమాయక ప్రజలను మోసగిస్తూ లక్షల రూపాయలను దోచుకుంటున్న ఓ స్వామిజీ బండారం బయటపడింది. ఓ యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా కమ్మదనం గ్రామ శివారులో నివాసం ఉండే స్వామిజీ మంత్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంతకీ ఏం జరిగింది?
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలోని కమ్మదనం గ్రామ శివారులో ఓ ప్రైవేటు వెంచర్లో అనంతపురం ప్రాంతానికి చెందిన శివస్వామి అనే వ్యక్తి ఇల్లు కట్టుకుని కొంతకాలంగా నివసిస్తున్నాడు. ఇంటి పరిసరాల్లో కాళికమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేస్తూ... మంత్రాలతో పూనకం వచ్చినట్టు నటిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుండేవాడని పోలీసులు తెలిపారు. గతంలోనూ ఇదే మాదిరిగా మధురాపూర్ గ్రామంలో పూజలు చేయగా... గ్రామస్థులు బెదిరించడంతో అక్కడినుంచి వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. అక్కడ నుంచి ప్రస్తుత వెంచర్లోకి మకాం మార్చాడని చెప్పారు. ఇక్కడ కూడా క్షుద్రపూజలు చేస్తూ అమాయకులను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నాడని వెల్లడించారు.
బాధితురాలి ఫిర్యాదు...
శివ స్వామి వల్ల మోసపోయిన ఓ యువతి... షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుటుంబ పరిస్థితి బాగాలేదని వెళ్తే... వేల రూపాయలు తీసుకొని మోసం చేశాడని వాపోయింది. అంతేకాకుండా తమ ఇంట్లోవారి మధ్యలో గొడవలు పెట్టించాడని ఆరోపించింది. స్వామిజీ చేస్తున్న మోసాలను వీడియో తీసి పోలీసులకు అందించింది.
ఇంట్లో బాగాలేదని శివస్వామి దగ్గరకు వెళ్లాను. మీ ఇంట్లో బాగాలేదు, చేతబడులు చేశారని చెప్పాడు. బాగు చేయడానికి చాలా డబ్బులు తీసుకున్నాడు. మాకేం చేయకపోగా... మా ఇంట్లో ఒకరికొకరికి పడకుండా చేశాడు. నాకు దెయ్యం పట్టిందని చెప్పి.. బాగా కొట్టాడు. కళ్లలో నిమ్మకాయలు పిండుతాడు. అవి తినకపోతే ఇష్టం వచ్చినట్లు బాదుతాడు. ఆయనకు ఇష్టం వచ్చినట్లు చేస్తాడు.