మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నిత్యం దుర్భాషలాడుతున్నాడని మతిస్థిమితం సరిగా లేని తండ్రిని కుమారుడు హత్య చేశాడు.
రాజీవ్‌గాంధీ నగర్లో నివసించే మహమ్మద్ ఇంతియాజ్(55) గతంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేశాడు. పది సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పటి నుంచి ఇంతియాజ్‌కు మతిస్థిమితం సరిగా ఉండటం లేదు. తరచూ ఇంట్లో వారిని అకారణంగా దూషిస్తూ ఉండేవాడు.
ఇంతియాజ్ ఆదివారం రాత్రి అతడి పెద్దకొడుకు సలావుద్దీన్ భార్యను తిట్టి, ఇంట్లో గొడవ చేశాడు. రాత్రి ఇంటికి వచ్చిన సలావుద్దీన్ ఇంట్లో జరిగిన గొడవ గురించి తెలుసుకొని తమ్ముడితో కలిసి తండ్రి నిద్రిస్తున్న గదిలోకి వెళ్లాడు. ఆవేశంతో తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. సలావుద్దీన్ సోదరుడు అతడిని అడ్డుకుని తండ్రిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: భర్తను కడతేర్చిన భార్య.. భూ వివాదమే కారణమా..?