బల్దియా పట్టణ ప్రణాళికా విభాగం ఏటా 10 వేల-15 వేల నిర్మాణాలకు అనుమతిస్తోంది. అనుమతి పొందిన ప్లాన్‌కు కాస్త అటుఇటుగా కడుతుంటారు. కొందరు అదనపు అంతస్తులు వేస్తుంటారు. చివరి అంతస్తులో గది నిర్మిస్తుంటారు. తాము ఇచ్చిన ప్లాన్‌కు అనుగుణంగా నిర్మిస్తేనే పట్టణ ప్రణాళికా విభాగం నివాసయోగ్యతా పత్రం(ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఇస్తుంది. ప్లాన్‌కు అనుగుణంగా లేనివారు కిందిస్థాయి అధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పి ఆ పత్రం పొందుతుంటారు. ఈ చిన్నపాటి లోపాలనే ఆసరాగా చేసుకొంటూ మరికొందరు అక్రమ దందాకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా నకిలీ విలేకరుల బృందాలు ఈ దందాలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. మనుగడలో లేని పత్రికల పేరుతో గుర్తింపు కార్డులు పొంది, వాటితో బెదిరింపులకు దిగుతున్నారు. ఇలాంటి ముఠాలు 150 వరకు ఉంటాయని చెబుతున్నారు.
డబ్బు డిమాండ్ చేసినందుకు ఫిర్యాదు
ఓ ప్రధాన పత్రిక(ఈనాడు కాదు) పేరుతోపాటు, ఆ పత్రిక ప్రతినిధి పేరు చెప్పి ప్రకటన కోసం ఓ భవన నిర్మాణదారును డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో ఒక పత్రికా విలేకరిపై బంజారాహిల్స్ పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ పత్రికకు చెందిన విలేకరి కిరణ్ బంజారాహిల్స్ రోడ్ నం.10లో మూడు రోజుల క్రితం ఓ భవన నిర్మాణదారుడి వద్దకు వెళ్లి తనతోపాటు మరో ప్రధాన పత్రిక, ఆ పత్రిక విలేకరి సతీష్‌కుమార్ పేరును ఉటంకిస్తూ ప్రకటన కోసం డబ్బులు డిమాండ్ చేశాడు. ఈమేరకు ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలయింది. సతీష్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్‌తోపాటు అతనికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవిగో నిదర్శనాలు..
*జూబ్లీహిల్స్‌లో మాజీ సీఎం బంధువుల ఇంటి వద్దకు విలేకరులమని వెళ్లి రూ.లక్షలు దండుకున్నారు.
*షేక్‌పేటలో ఓ ఏసీపీ బంధువు వద్ద రూ.లక్షలు లాగేశారు. అక్రమ నిర్మాణం కదా అని ఏసీపీని దబాయించారు.