తెలంగాణ

telangana

ETV Bharat / crime

మృత్యువులోనూ వీడని స్నేహం... రోడ్డు ప్రమాదంలో సజీవ దహనం

ROAD ACCIDENT IN PRAKASAM DISTRICT: వాళ్లు ముగ్గురు ప్రాణ స్నేహితులు.... భాకరాపేట స్నేహబంధం ఎంతో మధురం అంటూ ముగ్గురు కలిసి మెలిసి సాగారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తుంటారు. అన్ని విషయాలు ఒకరికొకరు పంచుకుంటారు. వారి స్నేహం చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో.. ముగ్గురిని ఒకేసారి తీసుకుపోయింది. ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ సజీవ దహనమయ్యారు.

prakasham crime update
prakasham crime update

By

Published : May 18, 2022, 10:08 AM IST

ROAD ACCIDENT: ఒక్క రోడ్డు ప్రమాదం ముగ్గురు స్నేహితులను బలితీసుకుంది. మృత్యువులోనూ నీకు తోడుగా నేనొస్తున్నా అంటూ ముగ్గురు ఒకేసారి అగ్నికి ఆహుతయ్యారు. ఈ విషాద ఘటనతో మూడు కుటుంబాల్లో చీకటి అలుముకుంది. పెద్ద కొడుకును కోల్పోయి ఓ ఇల్లు, ఒక్కగానొక్క తమ్ముడిని పోగొట్టుకుని అక్కలు, ఒక్కగానొక్క కుమారుడు దూరమై మరో కుటుంబం దిక్కులు పిక్కటిళ్లేలా విలపిస్తున్నారు.

ఏపీలోని ప్రకాశం జిల్లా కంభం-మార్కాపురం జాతీయ రహదారిలో మంగళవారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో భాకరాపేటకు చెందిన తేజ(29), ఇమ్రాన్‌(21), బాలాజీ(21) మృతిచెందారు. తేజ ఈ నెల చివరిలో విదేశాలకు వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం విజయవాడకు వెళ్లి అక్కడ విదేశాలకు వెళ్లడానికి కావలసిన పత్రాలు అందజేసి వస్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది.

పెద్ద కుమారుడ్ని కోల్పోయి:భాకరాపేటలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఎదురు వీధిలో నివాసం ఉంటున్న సత్యనారాయణ, ఇందిరకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బాలాజీ బీటెక్‌ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. సత్యనారాయణ తిరుమలలోని కల్యాణ కట్టలో కాంట్రాక్ట్‌ సిబ్బందిగా పనిచేస్తున్నారు. కారు ప్రమాదంలో చేతికి అందివచ్చిన పెద్ద కొడుకు దూరం కావడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇద్దరు అక్కల ముద్దుల తమ్ముడు:భాకరాపేట సంధువీధికి చెందిన మస్తాన్, నజీరలకు ముగ్గురు పిల్లలు. వీరిలో ఇద్దరు కూతుళ్లు కాగా ఇమ్రాన్‌ చివరి వాడు. మస్తాన్‌ భాకరాపేటలో సైకిల్‌ షాపు నిర్వహిస్తూ చిన్న దుకాణం పెట్టుకున్నాడు. ఇమ్రాన్‌ ఇద్దరు అక్కలకు ముద్దుల తమ్ముడు. ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టిన కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ప్రస్తుతం ఇమ్రాన్‌ గుంటూరులో టెలికాం సర్వీస్‌ డిపార్ట్‌మెంటుకు బొలేరో వాహనాన్ని అద్దెకు ఇచ్చి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కారు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

ఒక్కగానొక్క కొడుకు దూరం:భాకరాపేట బీసీ కాలనీకి చెందిన భాస్కర్, వసంతలకు తేజ ఒక్కగానొక్క కొడుకు. భాస్కర్‌ పెయింటింగ్‌ పనులు చేసుకుంటుండగా, వసంత దుస్తులు ఇస్త్రి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తేజకు పెళ్లై 5 సంవత్సరాల కూతురు హాసిని ఉంది. విభేదాల వల్ల భార్య దూరంగా ఉండడంతో కూతురిని తన దగ్గరే ఉంచుకున్నాడు. తేజ ఈ నెల చివరలో విదేశాలకు వెళ్లడానికి సిద్ధం అవుతూ అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించడానికి విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదంలో చనిపోయాడు. కొడుకు కారు ప్రమాదంలో చనిపోవడంతో తమకెవరు దిక్కంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కూతురు హాసిని తండ్రిని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details