తెలంగాణ

telangana

ETV Bharat / crime

పల్లీ యంత్రం.. ఆ బాలుడి భవిష్యత్తును చిదిమేసింది

పండుగ రోజు పొలానికి వెళ్లడమే ఆ బాలుని పాలిట శాపమైంది. తల్లిదండ్రులతో కలిసి సరదాగా వెళ్తే అదే చివరి ప్రయాణమైంది. సంతోషంగా ఆడుతూ పాడూతూ తిరుగుతున్న బాలున్ని మాయదారి యంత్రం బలి తీసుకుంది. ఒక్కసారిగా తల్లిదండ్రుల గుండె పగిలేలా.. కన్నకొడుకును వారి కళ్లముందే విగతజీవిగా మార్చేసింది. ఉగాది రోజే ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.

boy died
బాలుడు మధు

By

Published : Apr 3, 2022, 8:18 AM IST

సరదాగా చేనుకు తీసుకెళ్లిన కుమారుడు కళ్లముందే విగతజీవిగా మారిపోతే ఆ తల్లిదండ్రుల గుండెకోత ఎలా ఉంటుంది? చెంగుచెంగున దుముకుతూ వచ్చిన పిల్లాడిని మాయదారి యంత్రం లాగేసి క్షణాల్లో తలను, మొండేన్ని వేరుచేస్తే ఆ దృశ్యం చూసి తట్టుకోవడం ఎవరివల్ల అవుతుంది? ఉగాది పండగ చేసుకున్న కాసేపటికే కన్నకొడుకు కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించడం అక్కడివారిని కంటతడి పెట్టించింది. తీవ్ర విషాదం నింపిన ఈ ప్రమాదం నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో శనివారం చోటుచేసుకుంది.

కొండమల్లేపల్లి మండలం గాజీనగర్‌ గ్రామానికి చెందిన పేట జానీ-రాణి దంపతులకు ఇద్దరు కుమారులు. శనివారం ఉదయం ఇంటివద్ద ఉగాది పండుగ చేసుకున్నారు. పాఠశాలకు సెలవు కావడంతో కుమారులిద్దరినీ చేను వద్దకు తీసుకెళ్లారు. తల్లిదండ్రులు తమ పల్లి చేనులో యంత్రం ద్వారా పల్లీలను వేరు చేయించే పనిలో నిమగ్నమయ్యారు. ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. చిన్న కుమారుడు మధు (9).. మెడలో చున్నీ చుట్టుకుని సంబరంగా గంతులేస్తూ పల్లి కోత యంత్రం పక్కకు వెళ్లాడు. ఈ క్రమంలో మధు మెడలోని చున్నీ యంత్రంలో చుట్టుకుని రెప్పపాటు సమయంలోనే తల తెగిపడింది. అంతే ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. వారి రోదనలు మిన్నంటాయి. అక్కడున్న వారు తీవ్రంగా కలత చెందారు. కుటుంబ సభ్యులు, బంధువులు అశ్రునయనాల మధ్య బాలుడి అంత్యక్రియలు పూర్తిచేశారు. తండ్రి జానీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు.

ఇదీచూడండి:Suicides due to Debts: 'వడ్డీ' వేధింపులు.. ఒత్తిడితో బాధితుల బలవన్మరణాలు

ABOUT THE AUTHOR

...view details