ANDHRA PRADESH ATM THEFT: ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కోడిగుడ్డు సత్రం వెనుక బజార్లో ఉండే షేక్ అబ్దుల్, రహీంలు చిన్ననాటి నుంచే స్నేహితులు. వీరిద్దరూ మాయాబజార్లో కాలం చెల్లిన వాహనాలు పగులగొట్టే పనిచేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా మద్యం, జల్సా జీవితాలకు అలవాటుపడ్డారు. ఇలా కష్టపడి పనిచేస్తూ.. తమకిష్టమైనవి చేయలేమని.. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నారు. అందుకోసం ఏటీఎంను పగలగొట్టాలనుకున్నారు. రెక్కీ చేసి మరీ ఎక్కడి ఏటీఎంను పగలగొట్టాలి, ఎలా తప్పించుకోవాలో... పథకం పన్నారు.
రంగంలోకి ఎస్సై సోదరుడు...
అందులో భాగంగానే ఇద్దరూ కలిసి పట్టణంలో ఓ ఇంటి ముందు ఉంచిన ద్విచక్రవాహనాన్ని దొంగిలించారు. పెదకాకాని పరిధిలోని ఆటోనగర్ వద్దకు చేరుకున్నారు. ముందుగా తమ వెంట తెచ్చుకున్న పరికరాలతో హైటెక్ కంపెనీ ఏటీఎంను పగలగొట్టే ప్రయత్నం చేశారు. విషయం గుర్తించిన వాచ్మెన్ 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. తమ ఇంటికి దగ్గరలోనే దొంగతనం జరుగుతున్నందున.. ఎస్సై వినోద్ కుమార్ తన సోదరుడు వినయ్‌కు అక్కడికి వెళ్లమని చెప్పాడు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న వినయ్... ఇద్దరు దొంగలను పట్టుకున్నాడు. పోలీసులు వచ్చే వరకు వారిని ఎటు వెళ్లనీయకుండా చేశాడు.