Tribal University arrangements in Telangana: ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ట్రైబల్ యూనివర్సిటీల కోసం రూ.44 కోట్ల నిధులు కేటాయింటారు. అప్పటి పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ప్రస్తావన వచ్చింది. అప్పటి నుంచి మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్డీ) విశ్వవిద్యాలయం ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించింది. నవంబర్‌లో జరగనున్న సమావేశాల్లో అవసరమైన బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్ర కసరత్తు చేస్తోందని సంబంధిత అధికారులు తెలిపారు.
జాకారం వైటీసీలో తరగతుల నిర్వహణకు అవకాశం..హెచ్‌సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ) ఆధ్వర్యంలో వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. పార్లమెంటులో ఆమోదం పొందాక అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటీవల హనుమకొండలో జరిగిన భాజపా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీకి అవసరమైన భవనాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ.800 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
పార్లమెంటు బిల్లు ఆమోదం తర్వాత సీపీడబ్ల్యూడీ (సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్) ద్వారా భవన సముదాయాల నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర పనులు చేపడతారు. అలాగే హెచ్‌సీయూకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. వీసీని నియమించి, తరగతుల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. సీట్ల కేటాయింపులు నిర్వహించి తరగతులు ప్రారంభిస్తారు. భవనాలు అందుబాటులోకి రాకున్నా తాత్కాలికంగా జాకారం వైటీసీలో తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది.