తెలంగాణ

telangana

ETV Bharat / city

శరవేగంగా కాజీపేట రైల్వే బ్రిడ్జి పనులు.. వచ్చే ఏడాది కల్లా ప్రారంభం

కాజీపేటలో నిర్మిస్తున్న రెండో ఆర్వోబీలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. రైళ్ల రాకపోకలకు ఏమాత్రం అంతరాయం లేకుండా వంతెన నిర్మాణాన్ని కొనసాగించేందుకు ముందే సిద్ధం చేసిన బౌస్ట్రింగ్‌ ఆర్చ్‌ను వంతెనపై బిగించనున్నారు. వంతెన మొత్తం 21 స్తంభాలతో నిర్మిస్తుండగా, ఇందులో రైల్వేలైన్ల పైభాగంలో మాత్రం విల్లు ఆకారంలో ఉండే నిర్మాణం మొత్తం ఉక్కుతో నిర్మించనున్నారు. ఇందుకోసం మూడు ప్రత్యేక పిల్లర్లు రూపొందిస్తున్నారు.

Rapidly continuing kajipet Railway Over Bridge Construction Works
శరవేగంగా కాజీపేట రైల్వే బ్రిడ్జి పనులు.. వచ్చే ఏడాది కల్లా ప్రారంభం

By

Published : Oct 6, 2020, 2:04 PM IST

రాష్ట్రంలో నిర్మిస్తున్న ఆర్వోబీలలో కాజీపేట రెండో ఆర్వోబీదే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానమని ఇంజినీర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్వోబీ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే కాజీపేట వైపు దాదాపు 9 పిల్లర్ల నిర్మాణం పూర్తి కావొచ్చింది. హన్మకొండ వైపు ప్రస్తుతం స్తంభాలను నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ రైలు పట్టాలపై దాదాపు 152 మీటర్ల పొడవుతో రెండు భాగాలను ముందే నిర్మించి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా నిర్మాణాలు కొనసాగించనున్నారు. ప్రస్తుతం ఉన్న వంతెన కన్నా కొత్త వంతెన ఎక్కువ ఎత్తు ఉండనుంది. రెండో ఆర్వోబీ వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ కల్లా అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

శరవేగంగా కాజీపేట రైల్వే బ్రిడ్జి పనులు.. వచ్చే ఏడాది కల్లా ప్రారంభం

ట్రాఫిక్​ సమస్య తీర్చేందుకు..

కాజీపేటలో రెండో ఆర్వోబీ నిర్మాణంలో అనేక ప్రత్యేకతలున్నాయి. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ వంతెన అంచనా వ్యయం రూ.78 కోట్లు కాగా, ఇందులో భూసేకరణ, ఇతర పనులకు పోను.. వంతెన నిర్మాణానికి కేవలం రూ.54 కోట్లే ఖర్చవడం గమనార్హం. రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షణలో వెంకటేశ్వర కన్‌స్ట్రక్షన్స్‌ అనే ఏజెన్సీ ఈ ఆర్వోబీని నిర్మిస్తోంది. పాత వంతెన ఇరుగ్గా ఉన్న దృష్ట్యా కొత్త వంతెనపై రహదారి వెడల్పును 9.5 మీటర్లకు పెంచనున్నారు. అందులో ఎడమవైపు పాదచారుల కోసం 1.5 మీటర్లతో ఫుట్​పాత్​ నిర్మిస్తారు. వంతెనపై ఒకేసారి మూడు వరుసలుగా వాహనాలు వెళ్లేలా రోడ్డు నిర్మిస్తారు. హన్మకొండ - హైదరాబాద్‌ రహదారిలో ఉన్న పాత వంతెనపై వాహనాల రద్దీ బాగా ఎక్కువ కావడం, అనేక మార్లు ట్రాఫిక్‌ స్తంభించడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రెండో ఆర్వోబీని మంజూరు చేసింది.

వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి..

2017 అక్టోబర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జౌళి పార్కు శంఖుస్థాపనతో పాటు.. ఈ ఆర్వోబీకి కూడా శంఖుస్థాపన చేశారు. అనంతరం భూసేకరణ విషయంలో కాస్త జాప్యం జరిగినా... ఎట్టకేలకు ఈ ఏడాది జులైలో వంతెన నిర్మాణం ప్రారంభమైంది. వచ్చే ఏడాది కల్లా బ్రిడ్జి అందుబాటులోకి వచ్చేలా శరవేగంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ వంతనకు.. మొత్తం వ్యయం రూ.78 కోట్లు. వంతెన దృఢంగా ఉండేలా 21 స్తంభాలతో నిర్మిస్తున్నారు. వంతెన పొడవు 1.17 కి.మీ కాగా.. వెడల్పు 9.5 మీటర్లుగా ఉంది.

పాత వంతెనకు మరమ్మత్తులు..

కొత్త వంతెన పూర్తయ్యేలోపు పాత వంతెనకు కూడా మరమ్మతులు చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఇప్పటికే రూ.30 లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటికే అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు పలుమార్లు వంతెన పనులను పర్యవేక్షించారు. ఈ వంతెన మరమ్మత్తులు పూర్తయితే.. వందేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు.


ఇదీ చూడండి: ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు.. ముమ్మరంగా గాలింపు

ABOUT THE AUTHOR

...view details