తెలంగాణ

telangana

ETV Bharat / city

చేతులెత్తి మొక్కుతున్నాం.. ఆదుకోండి - అటవీ గ్రామాల్లో గిరిజనుల అవస్థలు

Floods Effect in Mulugu District: గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద బీభత్సానికి జనజీవనం అతలాకుతలం అయ్యింది. ప్రజలు కట్టుబట్టలతో మిగిలిన పరిస్థితి నెలకొంది. కూలిన ఇళ్ల గోడలు, చుట్టూ, లోపల బురద, పాడైన సామగ్రి.. దోమలు, పాములు.. ములుగు జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది. చాలా ఇళ్లు వరదలకు దెబ్బతిన్నాయి. చేతులేత్తి మొక్కుతున్నాం ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Floods Effect
Floods Effect

By

Published : Jul 22, 2022, 9:19 AM IST

Floods Effect in Mulugu District: కూలిన ఇళ్ల గోడలు, చుట్టూ, లోపల బురద, పాడైన సామగ్రి.. దోమలు, పాములు.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పలు గిరిజన గ్రామాల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది. చాలా ఇళ్లు వరదలకు దెబ్బతిన్నాయి. గోదావరి వరదే కాకుండా వాగులు, వంకల నీరు ముంచెత్తడం వల్ల చిన్న, చిన్న గిరిజన గ్రామాల్లో ఇళ్లు అధ్వానంగా తయారయ్యాయి. కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వెళ్లినవారు తిరిగొచ్చి తమ ఇళ్లకు చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి ఇద్దరు అధికారులను వరంగల్‌ కలెక్టర్‌ పంపారు. వారిని చూడగానే.. ‘‘భారీ వర్షాలు, గోదావరి వరదలతో మా ఇళ్లు కూలిపోయాయి. ఒకసారి ఇంటి దాకా వచ్చి మా కష్టాన్ని కళ్లారా చూసి ఆదుకోండి’’ అని గిరిజనులు చేతులెత్తి వేడుకున్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పర్యవేక్షణ అధికారులుగా వచ్చిన కిషన్‌, వెంకన్నలు హామీ ఇచ్చారు.

ట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్న బుట్టాయిగూడెం, లక్ష్మీపురం, గుర్రేవుల, దేవాదుల, తుపాకులగూడెం, రొయ్యూరు, రాంనగర్‌ తదితర గ్రామాల్లో ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. ములుగు జిల్లాలో 31 ఇళ్లు పూర్తిగా, మరో 227 పాక్షికంగా దెబ్బతిన్నాయని ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదించింది. ఈ జిల్లాలోని 9 మండలాల్లో 15 రోడ్లు కోతకు గురయ్యాయి. పలుచోట్ల రోడ్లపై పెద్ద గుంతలు ఏర్పడి బురదమయంగా మారాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 1,119 ఇళ్ల గోడలు కూలిపోయాయి. 58 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. 28 రోడ్లు కోతకు గురయ్యాయి. చాలాచోట్ల రోడ్లపై గుంతలు పడ్డాయి. వరదలతో మిషన్‌ భగీరథ పైపులైన్లు దెబ్బతినడంతో తాగునీటి సరఫరా లేక బావులు, చేతిపంపుల నీటిని తాగుతున్నారు.

ఇళ్ల ముందు బురద, నీరు..

ములుగు జిల్లా దేవాదుల, బుట్టాయిగూడెం, తుపాకులగూడెం, నందమూరి నగర్‌ తదితర గ్రామాల్లో అనేక ఇళ్ల ముందు బురద, నీరు చేరింది. ఇళ్లలో తేమ, దోమల స్వైరవిహారం, పాములతో వాటిలో ఉండాలంటేనే భయమేస్తోందని పలువురు గిరిజనులు తెలిపారు. వరదకు ఇంటి మట్టిగోడలు కూలిపోయి రోడ్డున పడ్డానని దేవాదులకు చెందిన వృద్ధురాలు సి.బాలక్క ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలోని వాగు వల్ల ఇంటి చుట్టూ నీరు ఊరుతోందని, పాములు, తేళ్లు వస్తున్నాయని.. గోడలు లేని ఇంట్లో ఉండలేకపోతున్నానని తెలిపారు. వరద తగ్గినా రోగాలు వ్యాపిస్తాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ సిబ్బంది రోడ్ల వెంట బ్లీచింగ్‌ పొడి చల్లుతున్నారు.

రహ‘దారుణాలు’..

పలుచోట్ల రోడ్లు దెబ్బతినడంతో మారుమూల గ్రామాల ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. ములుగు జిల్లా కమలాపురం నుంచి రాంనగర్‌ వెళ్లే రహదారికి మీదుగా పలు ప్రాంతాల్లో వాగు నీరు గోదావరిలోకి వెళ్తుండటంతో గుంతలు పడి, బురదమయంగా మారింది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) కార్యాలయం పక్క నుంచి రొయ్యూరు మీదుగా పలు గిరిజన గ్రామాలకు వెళ్లే తుపాకులగూడెం ప్రధాన రహదారిపై పలు గుంతలు ఏర్పడి కంకర తేలింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details