కరోనా వైరస్ దృష్ట్యా అన్ని రంగాల్లో ఆన్‌లైన్ ప్రాధాన్యం పెరుగుతోంది. విద్యా రంగంలోనూ ఆన్‌లైన్ విధానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని అర్బన్ విద్యాశాఖ ముందే గుర్తించింది. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై కసరత్తు జరుగుతోంది. లాక్‌డౌన్ నుంచి మొదలు కొంటే ఇప్పటి వరకు సుమారు 600 ఉపాధ్యాయులు ఆన్‌లైన్ తరగతులపై లోతైన అవగాహన పొందారు. ప్రభుత్వం పచ్చజెండా ఊపిన వెంటనే ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు సైతం సిద్ధంగా ఉన్నారు. తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతూ వారికి విజ్ఞానాన్ని పంచే ఉపాధ్యాయులు ఇప్పుడు నెట్‌లో ఆన్‌లైన్ పాఠాలు చెప్పడంలోనూ ఆరితేరారు.
ఆన్‌లైన్‌లో..
వరంగల్ అర్బన్ విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌పై శిక్షణ ఇప్పించాలనుకున్న తరుణంలో అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు వంగపాటి రాజశేఖర్‌రెడ్డి గురించి తెలిసింది. వరంగల్‌కు చెందిన ఈయన కొన్ని దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్లినా సొంత గడ్డ వరంగల్‌ను మరవలేదు. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌గా ఉన్నత స్థానంలో ఉన్నా పురిటిగడ్డకు సేవ చేయాలనే తపనతో సేవా కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నారు. వరంగల్‌లోని కృష్ణాకాలనీలోని పాఠశాలతోపాటు మరికొన్ని సర్కారు బడులను దత్తత తీసుకొని కంప్యూటర్లు కొనిచ్చి విద్యార్థులకు గతంలో స్వయంగా ఆన్‌లైన్ పాఠాలు బోధించారు. ఉపాధ్యాయులకు కూడా ఆన్‌లైన్ పాఠాలు బోధించే విధానంపై అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులు కోర డంతో ఆయన ఏప్రిల్ నుంచి రోజూ ఉపాధ్యాయులకు రెండు గంటలపాటు ఆన్‌లైన్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
ఎన్నో మెలకువలు
వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన సుమారు 130 గణిత ఉపాధ్యాయులు మొదట శిక్షణ తీసుకున్నారు. అలా 28 రోజులపాటు ఆన్‌లైన్ తరగతుల్లో పాల్గొన్నారు. అంక గణితం, బీజ గణితం తదితర పాఠ్యాంశాలు ఆన్‌లైన్‌లో సమర్థంగా ఎలా బోధించాలనే విషయాలపై ఉపాధ్యాయులు సమగ్ర అవగాహన పొందారు. అనంతరం విజ్ఞాన శాస్త్రం ఉపాధ్యాయులు ఆన్‌లైన్ తరగతులను విన్నారు. కేవలం అర్బన్ జిల్లా వారే కాకుండా ఉమ్మడి వరంగల్, నల్గొండ, మెదక్, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయులు కూడా ఆన్‌లైన్ తరగతులపై ఆసక్తి చూపి శిక్షణ పొందుతున్నారు. అలా గణితం, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, ఆంగ్లం తరగతుల ఉపాధ్యాయులు ఇప్పటి వరకు 600 మందికిపైగా ఆన్‌లైన్ తరగతులపై తర్ఫీదు పొందారు. పాఠాలను ఆన్‌లైన్ వీడియోలు చేయడం, వాయిస్‌ద్వారా టెక్ట్స్ రూపొందించే విధానం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం.. ఇలా ఆన్‌లైన్ బోధనలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నారు. కార్పొరేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు దీటుగా ఆన్‌లైన్ తరగతులు విద్యార్థులకు బోధించగలరు. నేటి నుంచి సామాజిక శాస్త్రం (సోషల్) పాఠ్యాంశాలను ఆన్‌లైన్‌లో బోధించడంపై ఆ సబ్జెక్టు టీచర్లు శిక్షణ పొందేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.