వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి వ్యవసాయం చేస్తూనే.. మొక్కల పెంపకం చేపట్టారు. యుక్త వయసులోనే మొక్కలు పెంచడం మొదలు పెట్టిన ఆయన దాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నారు. ఎక్కడ కొత్తరకం మొక్క కనిపించినా వెంటనే దాన్ని తెచ్చుకొని తన పెరట్లో నాటేవారు. అంతలా ఇష్టం ఆయనకు మొక్కలంటే.
తన ఇంటినే వనంగా మార్చి.. గత ముప్పై ఏళ్లుగా మొక్కలు పెంచుతూనే ఉన్నారు. భార్య పద్మను కూడా అందులో భాగస్వామిని చేశారు. ప్రేమతో మొదలు పెట్టిన మొక్కల పెంపకమే.. ఇప్పుడు వారికి ఉపాధిగా మారింది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేశారు. వందకు పైగా పండ్ల మొక్కలు, 120కి పైగా పూలమొక్కలు, 150కి మించి షోకేజ్ మొక్కలు, ఎర్రచందనం, టేకు వివిధ రకాల అరుదైన మొక్కలు పెంచుతూ ప్రకృతి ప్రేమికుడు అనిపించుకుంటున్నారు బుచ్చిరెడ్డి. చదివింది పదో తరగతి వరకే అయినా... మొక్కల గురించి ఆయనకు తెలిసినంత శాస్త్రవేత్తలకు కూడా తెలియదేమో అంటారు రైతులు.
మొక్కలతో పాటు.. సలహాలు కూడా!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారానికి బుచ్చిరెడ్డి ఎన్నో మొక్కలు అందించారు. ప్రకృతి వనాల నిర్మాణంలో నాటే మొక్కల కోసం వరంగల్ జిల్లావ్యాప్తంగా బుచ్చిరెడ్డి మొక్కల పెంపక క్షేత్రం నుంచే మొక్కలు తీసుకెళ్తున్నారు. శ్రీ సాయి నర్సరీ పేరుతో బుచ్చిరెడ్డి నడుపుతున్న నర్సరీకి వచ్చి చుట్టుపక్కల గ్రామాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు మొక్కలతో పాటు.. ఆయన ఇచ్చే సలహాలను కూడా తీసుకెళ్తుంటారు.