ఆర్థిక అభివృద్ధే కాదు... మానవసంబంధాలూ పరిపుష్టం రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే గాక మానవసంబంధాలనూ పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కాకతీయ వైద్య కళాశాల వజ్రోత్సవ వేడుకలను మంత్రి ఎర్రబెల్లితో కలిసి ఘనంగా ప్రారంభించారు.
మార్పులకనుగుణంగా అభివృద్ధి
వైద్య రంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చేసి త్వరలోనే వైద్యరంగంలో చెరగని ముద్ర వేస్తామని మంత్రి ఈటల తెలిపారు. కంటి వెలుగు, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
చదవలేదన్న బాధ
తాను మంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఉన్నత విద్యనభ్యసించలేదన్న బాధ తనను ఎల్లప్పుడు వేధిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి కోసం వైద్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ విరాళాలను కలెక్టర్ పేరిట నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంకు ఖాతాకు అందించాలని విన్నవించారు.
పూర్వ విద్యార్థులకు సన్మానం
ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి పూర్వ విద్యార్థులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. కళాశాల ప్రస్తుత విద్యార్థులు పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో ఎంపీలు దయాకర్, బండ ప్రకాశ్, మేయర్ గుండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు రాజయ్య, వినయ్ భాస్కర్లు పాల్గొన్నారు.