మేడారం ఎఫెక్ట్: అమాంతం పెరిగిన 'బంగారం' ధర ములుగు జిల్లా మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో ప్రాశస్యమైనది. కోట్లాది మంది భక్తుల కోరికలు తీర్చే ఈ వనదేవతలకు చిన్న బంగారం ముక్కే ప్రసాదం. సమ్మక్క సారలమ్మకు బంగారం(బెల్లం) సమర్పించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు.
గిరిజన సంప్రదాయం ప్రకారం జరిగే జాతర కాబట్టి ఇక్కడ అమ్మవార్లకి మద్యం, మాంసం, బెల్లం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారస్థులు మద్యం, కొబ్బరికాయలు, కోళ్లు, మేకలు, బెల్లం ధరలను అమాంతం పెంచేశారు. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గడ్ మహారాష్ట్రల నుంచీ లక్షలాది మంది భక్తులు ఇక్కడి వచ్చి అమ్మవార్లను దర్శించుకుని తరించిపోతారు.
ఏదైనా గుడికి వెళ్తున్నామంటే కచ్చితంగా కొబ్బరికాయ కొంటాం. చిన్నచిన్న గుళ్ల వద్దే కొబ్బరికాయ ధర రూ. 15 ఉంటే మరి మేడారం జాతరలో ఎంత ఉంటుందనుకుంటున్నారు. ఒక్క కొబ్బరికాయ ధర రూ. 60 రూపాయలు అంటండీ.. అదేవిధంగా సమ్మక్క-సారలమ్మలకు కొంతమంది భక్తులు నిలువెత్తు బంగారం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. మామూలుగా దుకాణాల్లో రూ. 41 ఉండే బెల్లం అక్కడ మాత్రం రూ. 60 పలుకుతుందంటే ఆశ్చర్యం కలుగకపోదూ..!
మహా జాతర వెళ్తున్న సంతోషంలో భక్తులు ధరల సంగతే పట్టించుకోవడం లేదు. వనదేవతల దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని ధరలు తమకేమీ పట్టవని భక్తులు అంటున్నారు. ఏది ఏమైనా జాతర వచ్చిందంటే భక్తుల జేబులకు చిల్లు మాత్రం ఖాయమే కదా!?
ఇదీ చూడండి: మహాజాతరకు ముందే జనజాతర