పసుపు సాగుకు ఉత్తర తెలంగాణ పెట్టింది పేరు. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. ఏటా దాదాపు లక్ష ఎకరాల్లో పుసుపు పండిస్తారు. ఎకరం పంట సాగు చేయలంటే రూ. లక్షా 20 వేల నుంచి లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది. 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా... ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో 20 క్వింటాళ్లు మాత్రమే వస్తోంది.
ఎకరాకి రూ.50 వేల నష్టం!
విత్తనం నాటడం, ఎరువులు, పసుపు ఉడికించడం, ఆరబెట్టడం, రవాణా, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఫలితంగా క్వింటాకు రూ. 5వేల ధరతో ఎకరానికి దాదాపు రూ.50 వేల వరకు రైతులు నష్టపోతున్నారు. రైతుల చేతుల్లోకి పంట రాగానే ధర పడిపోవడం, వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళగానే పెరగడం సర్వ సాధారణంగా మారిపోయింది. తొమ్మిది నెలలు కష్టపడి పండించిన రైతుల కంటే.. దళారులు, వ్యాపారులే లాభాలు గడిస్తున్నారు. అందుకే 20 ఏళ్ల క్రితం మొదలైన పసుపు బోర్డు నిరసనలు... ప్రస్తుతం ఉద్యమంగా రూపుదిద్దుకుంది.
మధుయాస్కీ విఫలం, కవిత ఆశలు అడియాశలు...
2014 ఎన్నికల్లో మాజీ ఎంపీ కవిత... పసుపు బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అంతకు ముందు పదేళ్లు ఎంపీగా ఉన్న మధుయాష్కీ కూడా హామీ ఇచ్చి విఫలమయ్యారు. కేంద్రంలోని పెద్దలను కలుస్తూ వినతులు ఇచ్చింది కవిత. 2017లో అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. స్పైస్ రీజనల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని స్వాగతిస్తూనే పసుపు బోర్డు కోసం మాజీ ఎంపీ కవిత చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పతంజలి ద్వారా పసుపు పరిశ్రమ ఏర్పాటుకు కూడా ఆమె ప్రయత్నించారు.
పసుపు బోర్డు అన్నాడు... సుగంధం తెచ్చాడు !
సీజన్లో మద్దతు ధర కోసం ఏటా రైతులు ఆందోళనలు చేయడం... రాజకీయ పార్టీలు హామీలివ్వడం పరిపాటిగా మారింది. గతేడాది ఎన్నికల వేళ పసుపు పంట చేతికి రావడం వల్ల ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. ఏకంగా 176 మంది రైతులు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచి పసుపు బోర్డు అంశాన్ని దేశవ్యాప్తం చేశారు. భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచిన ధర్మపురి అరవింద్... గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చారు. దిల్లీ, నిజామాబాద్ అధికారులతో సమావేశాలు నిర్వహించిన అర్వింద్ చివరకు... స్పైస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుతో సరిపెట్టారు.
సుగంధం వల్ల ప్రయోజనం లేదు...
సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అధికార తెరాస తోపాటు కాంగ్రెస్, రైతు సంఘాలు ఘాటుగా విమర్శించాయి. రైతులను అర్వింద్ మోసం చేశారని... మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఇతర రైతు సంఘాలు బాణాలు ఎక్కుపెట్టాయి. భాజపా మాత్రం సంబరాలు చేసుకుంది. ప్రాంతీయ కార్యాలయం వల్ల ప్రయోజనం లేదని పసుపు రైతు సంఘం భావించింది. దశలవారీగా ఆందోళన చేసేందుకు రైతులు నిర్ణయించారు.
ఇప్పటికే మార్కెట్‌ను సందర్శించి బోర్డు ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. కాంగ్రెస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి సైతం మార్కెట్‌ను సందర్శించారు. అనంతరం రైతులను ఆరా తీశారు. మద్దతు ధర కోసం పాలనాధికారికి వినతి పత్రం అందించారు. ఈ క్రమంలో రైతులంతా సమావేశమై నిరసనలు తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు.
దశాబ్దాలుగా పసుపు బోర్డు కోసం ఆందోళనలు చేస్తున్నామని... ఇకనైనా కేంద్రం పసుపు పంటకు మద్దతు ధర దక్కేలా చూడాలని కోరుతున్నారు. లేదంటే ఉద్యమం తప్ప మరో మార్గం లేదన్నారు.
మాకొద్దీ సుగంధం... పసుపు బోర్డే కావాలి ! ఇవీ చూడండి : జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ విశేషాలేంటి..