బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నిర్మించిన ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం నాగార్జునసాగర్‌లో సుందరంగా ముస్తాబైంది. ఆసియాలోకెల్లా పెద్దదైన పార్కును 275 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కృష్ణానది ఒడ్డున సుందరంగా తీర్చిదిద్దారు. ఈనెల 13న పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌తో చర్చించి ప్రారంభోత్సవ ముహూర్తం నిర్ణయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో పార్కును ప్రారంభించనున్నారు.
బుద్ధవనం ప్రాజెక్టును మొత్తం ఎనిమిది విభాగాల్లో పనులు చేపట్టాల్సి ఉండగా...తొలుత ఐదు విభాగాల్లో చేపట్టిన స్థూపం పార్కు, జాతక పార్కు, బుద్ధచరిత్ర వనం, ధ్యానవనం, మహాస్థూపం పనులన్నీ ఈ నెల 15లోగా పూర్తవుతాయని అధికారులు తెలిపారు. తెలంగాణ పర్యాటక శాఖ ప్రతిష్ఠాత్మంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతోంది.