శరీరం కండరాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కండరాలు బలిష్ఠంగా తయారైతేనే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఆహారం తింటున్నా కూడా జిల్లాలోని వందల మంది కండలు రోజురోజుకూ కరిగిపోతున్నాయి! మనుషులు ఎముకల గూడులా మారుతున్నారు. శరీరంలో దుర్భలత్వం ఆవహిస్తుంది. అవయవాల కదలికలు నిలిచిపోతున్నాయి. సొంతగా కదలలేకపోతున్నారు. కూర్చోలేకపోతున్నారు. నడవలేకపోతున్నారు. తమ పని తాము చేసుకోలేకపోతున్నారు. జీవచ్ఛవాల్లా మారుతున్నారు. వీరు కదలాలంటే ఒకరు సాయం పట్టాల్సిందే. ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో అకస్మాత్తుగా ఇలాంటి స్థితి ఏర్పడడానికి కారణమేమిటని పరిశోధించిన వైద్య నిపుణులు దీన్ని ‘కండరాల క్షీణత వ్యాధి’గా గుర్తించారు. కండర కణ జాలానికి రక్షణగా నిలిచే ప్రోటీన్లు తయారు చేసే జన్యువు వీరిలో లోపిస్తున్నదని తేల్చారు. ఈ వ్యాధి జన్యుపరంగా, అనువంశికంగా వస్తుందని కనిపెట్టారు. నలభై వేల మందిలో ఒకరికి కండరాల క్షీణత వ్యాధి సంక్రమిస్తుందని విశ్లేషించారు.
‘కారుణ్య మరణం’ ప్రసాదించాలని..
కండర క్షీణత వ్యాధి బాధితులు ఇళ్లలోనే నరకాన్ని చూస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేల మంది ఎముకలను పెలుసుగా మార్చి, కాళ్లు, చేతులు, దంతాలను క్షయం చేసే ‘ఫ్లోరోసిస్’ పీడ ఉండేది. దానికన్నా భయంకరమైనదీ కండర క్షీణత (మస్క్యులర్ డిస్ట్రోఫీ) వ్యాధి. యాభయ్యేళ్ల పాటు జిల్లాలోని వేల మంది ఫ్లోరోసిస్ వ్యాధితో బాధలు పడ్డారు. శుద్ధి జలాలతో, పోషకాహారంతో ఫ్లోరోసిస్‌ను అధిగమించారు. తమకు ‘కారుణ్య మరణం’ ప్రసాదించాలని నాలుగేళ్ల క్రితం నల్గొండకు చెందిన వ్యాధిగ్రస్తుడు వేణుగోపాల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడంటే వాళ్లు ఎంతటి బాధను అనుభవిస్తున్నారో అర్థమవుతుంది.
ఫ్లోరోసిస్‌ను మించిన వ్యాధి
- కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులది విభిన్నమైన పరిస్థితిగా గుర్తించి ఆసరా పింఛను నెలకు రూ.10వేలు మంజూరు చేయాలి.
- రోగగ్రస్తులను కుటుంబంలో ఒకరు నిరంతరం కనిపెట్టుకుని ఉండాల్సి ఉన్నందున వారికి ‘కేర్‌టేకర్ అలవెన్సు’ కింద నెలకు రూ.15వేలు ఇవ్వాలి.
- ఆరోగ్య కార్డు ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలి.
- బ్యాటరీతో నడిచే వీల్‌చైర్లు ఇవ్వాలి.
- కండరాల క్షీణతను అధిగమించేలా ప్రతి రోజూ పోషకాహారం ఇవ్వాలి.
- కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు అన్ని ప్రభుత్వ పథకాల్లో 5శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
- రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయాలి.
- గర్భస్త పిండానికి జన్యులోపం ఉందేమో కనుక్కునే పరీక్ష నిర్వహించాలి.
బాధితులం.. బాధితుల కోసం సంఘం
నేను చౌటుప్పల్‌లో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఓరోజు నడుస్తూ నడుస్తూ పడిపోయాను. వైద్యులను సంప్రదిస్తే ఔషధాలు ఇచ్చారు. వాటిని వాడినా తగ్గలేదు. డిగ్రీ కళాశాలలో తరగతి గదిలోకి పోవడానికి భవనం మెట్లు ఎక్కలేని పరిస్థితి వచ్చింది. హైదరాబాద్‌లో వైద్య నిపుణులు బయాప్సీ పరీక్ష నిర్వహించారు. కండర క్షీణత వ్యాధి అని నిర్ధరించారు. అప్పటిదాకా నాకా వ్యాధి గురించి తెలియదు. మాది లింగమోనిగూడెంలోని నిరుపేద కుటుంబం. నా తల్లిదండ్రులు అప్పు చేసి రూ.అయిదు లక్షల వరకు వైద్యానికి ఖర్చు చేశారు. ఫలితం శూన్యం. నాన్న కూలికి పోతే అమ్మ నాదగ్గర ఉండి సేవ చేస్తుంది. ఏడాది క్రితం వరకు అమ్మను పట్టుకుని నడిచేవాడ్ని. ఇప్పుడు నడవలేకపోతున్నా. ఇలాంటి బాధితులం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 500 మందికి పైగా, తెలంగాణలో 3500 మందికి పైగా ఉన్నాం. మేం ఒకరికొకరం తోడుగా ఉండాలని, ప్రభుత్వానికి, సేవా సంస్థలకు వారధిలా ఉండాలని 2015లో ఏడుగురం బాధితులం కలిసి అసోసియేషన్ ఏర్పాటు చేశార. ప్రభుత్వానికి మా సమస్యలను వివిధ సందర్భాల్లో వివరించాం. సహాయాన్ని కోరుతున్నాం. - కత్తుల బాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ బాధితుల అసోసియేషన్