munugode by-election: రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీలు ప్రచారజోరు పెంచాయి. సవాళ్లు..ప్రతి సవాళ్లతో ఈ ప్రాంతం ప్రతిధ్వనిస్తోంది. ఎటుచూసినా ప్రధాన పార్టీల నేతలు..వారి అనుచరులే కన్పిస్తున్నారు. మా పార్టీలో చేరితే అంతిస్తాం..ఇంతిస్తాం అంటూ ప్రలోభపెట్టే పనిలో వారంతా నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలో ఏళ్లుగా తిష్ఠ వేసిన సమస్యల ప్రస్తావన మాత్రం ఏ ఒక్కరి నోటివెంటా రాకపోవడం సగటు ఓటరును ఒకింత బాధిస్తోంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో రాజకీయాలు ఎక్కువగా డబ్బు, మద్యం చుట్టూ తిరుగుతున్నాయి తప్పితే తమ బాధలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పరిశోధన కేంద్రం.. అటకెక్కినట్టేనా..దేశంలోనే అత్యధిక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా నియోజకవర్గానికి పేరుంది. ఇక్కడ పూర్తిస్థాయిలో ఫ్లోరోసిస్ నియంత్రణకు పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పాలని 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చౌటుప్పల్ మండలం మల్కాపురాన్ని ప్రతిపాదించింది. ఇందుకు రూ.100 కోట్ల నిధులిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది ఎకరాల భూమిని కేటాయించింది. పరిశోధన కేంద్రం ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీగా ఉన్న హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థకు సదరు స్థలాన్ని అప్పగించారు. ఇప్పటివరకు ఆ దిశగా అడుగు మాత్రం ముందుకు పడలేదు.
జౌళి పార్కు అలంకారమే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నలభై వేలకు పైగా చేనేత కుటుంబాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా మునుగోడు నియోజకవర్గంలోనే ఉన్నాయి. జాతీయ భౌగోళిక గుర్తింపు పొందిన పుట్టపాక, పోచంపల్లి చీరల్లో ఎక్కువభాగం ఈ ప్రాంత నేతన్నల మగ్గాలపైనే తయారవుతాయి. వారి ఉపాధిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం 2005లో చౌటుప్పల్ మండలం మల్కాపురంలో ‘ఔళి పార్కు’ను ఏర్పాటుచేసింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల భూమిని సేకరించింది. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో మంజూరు చేసిన రూ.3.31 కోట్లతో ఇక్కడ కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. ఎగ్జిబిషన్ హాల్, బిజినెస్ రీసోర్సెస్, క్యాడ్ డిజైన్, కామన్ ఫెసిలిటీ కేంద్రాలు నెలకొల్పడంతో పాటు బ్యాంకు ఏర్పాటుచేస్తామంటూ అప్పట్లో ప్రతిపాదించారు. అవన్నీ ఏర్పాటై 110 యూనిట్లు పనిచేసేలా చూస్తే ఇప్పటికిప్పుడు కనీసం 5,000 మందికి ఉపాధి లభించే అవకాశముంది. ఆ దిశగా అడుగులు ముందుకు పడకపోవడంతో ఈ పార్కు ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. నియోజకవర్గంలోని కొయ్యలగూడెం, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, పుట్టపాక, గట్టుప్పల్, తేరట్‌పల్లి, చండూరులలో చేనేత క్లస్టర్ల ఏర్పాటు ప్రతిపాదనా అటకమీదే ఉంది.