తెలంగాణ

telangana

ETV Bharat / city

అంచనాకు మించి దిగుబడులు.. రికార్డు స్థాయిలో కొనుగోళ్లు - Rice cultivation in mahabubnagar district

ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి వరిసాగు కొత్త మైలురాళ్లను దాటుతోంది. ఈ యాసంగిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 5 లక్షల ఎకరాలకు పైగా వరి సాగవ్వగా.. అంచనాలకు మించి దిగుబడులు వచ్చాయి. పౌర సరఫరాల శాఖ కూడా రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎంతలా పోటెత్తిందంటే... ఖరీఫ్ ప్రారంభమై నెల గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు కొనసాగాయి. మిల్లుల సామర్థ్యం సరిపోక... పాఠశాలలు, రైతు వేదికలు, మార్కెట్ గోదాముల్ని ధాన్యం బస్తాలతో నింపేశారు. అలాంటి నిల్వల్ని ఖాళీ చేయాలంటే మరో వారం రోజుల సమయం పట్టేలా ఉంది. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ఈసారి రికార్డు స్థాయిలో కొనసాగిన ధాన్యం కొనుగోళ్లపై కథనం.

Mahabubnagar District News, Paddy Yields in Palamur, Yasangi Paddy in Palamur
మహబూబ్​నగర్ జిల్లా వార్తలు, పాలమూరులో వరి దిగుబడులు, పాలమూరులో యాసంగి వరిసాగు

By

Published : Jun 30, 2021, 12:02 PM IST

Updated : Jun 30, 2021, 1:13 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో యాసంగి వరిసాగు గతంలో ఎప్పుడూ లేని కొత్త రికార్డుల వైపు దూసుకుపోతోంది. సాగైన వరి విస్తీర్ణం, వచ్చిన దిగుబడులు, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం అన్నీ గత గణాంకాలను దాటేస్తున్నాయి. మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా 5లక్షల 75వేల ఎకరాల్లో వరిసాగైంది. సాగైన విస్తీర్ణానికి అనుగుణంగా సాధారణ దిగుబడులను అధికారులు అంచనా వేశారు. కానీ అంచనాలకు మించి ఈసారి దిగుబడులొచ్చాయి.

పోటెత్తిన ధాన్యం..

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోటెత్తింది. పౌర సరఫరాల శాఖ ఈసారి రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేపట్టింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎంతగా పోటెత్తిందంటే.. ఖరీఫ్ ప్రారంభమైనా జూన్ నెలాఖరు వరకు కొనుగోళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. మిల్లుల సామర్థ్యం సరిపోక.... అందుబాటులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కస్తూర్బాలు, వ్యవసాయ మార్కెట్ గోదాములు, రైతు వేదికల్ని ధాన్యం బస్తాలతో నింపేశారు.

బడులు.. రైతు వేదికల్లో ధాన్యం నిల్వ

మహబూబ్​నగర్ జిల్లాలో 53 మిల్లులుంటే వాటిలో 33 మిల్లులకు సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయించారు. మిల్లుల సామర్థ్యం లక్షా 70వేల మెట్రిక్ టన్నులు. కానీ కొనుగోలు చేసిన ధాన్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు. ఇవి కాకుండా వనపర్తి, నారాయణపేట జిల్లాల్లోని 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పాలమూరు మిల్లులకు కేటాయించారు. మిల్లులు తీసుకోవాల్సిన ధాన్యం 2లక్షల 50వేల మెట్రిక్ టన్నులకు చేరింది. నిల్వ చేసేందుకు గోదాములు లేక..పాఠశాలలు, రైతువేదికల్ని ధాన్యం బస్తాలతో నింపేశారు.

ఖాళీ చేయాల్సిందే..

నారాయణపేట జిల్లాలో ఉన్నది కేవలం మూడే మిల్లులు. సామర్థ్యం లేక అక్కడి ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించడానికి యత్నించగా.. నిల్వకు స్థలం లేక స్థానికంగానే తాత్కాలికంగా నిల్వ ఉంచారు. మహబూబ్​నగర్ జిల్లాలో 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికీ మిల్లులకు చేరాల్సి ఉంది. వీటిని ఖాళీ చేసేందుకు మరో వారం సమయం పట్టేలా కనిపిస్తోంది. జులై నంచి తరగతులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠశాలల్ని, అటు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్ననేపథ్యంలో రైతువేదికల్ని ఖాళీ చేయాల్సి ఉంది.

లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోళ్లు..

మహబూబ్​నగర్ జిల్లాలో యాసంగిలో లక్షా 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పౌరసరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యానికి మించి 2లక్షల 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నారాయణపేట జిల్లాలోనూ లక్ష్యానికి మించి లక్షా 61వేల మెట్రిక్ టన్నులు, నాగర్ కర్నూల్ జిల్లాలో 2లక్షల 77వేల మెట్రిక్ టన్నులు, వనపర్తి జిల్లాలో 3లక్షల మెట్రిక్ టన్నులు, జోగులాంబ గద్వాల జిల్లాలో 87వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. యాసంగిలో ఇంత ధాన్యం కొనుగోలు చేయడం దాదాపుగా ఇదే మొదటిసారి. గిట్టుబాటు ధర కోసం రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపైనే ఆధారపడ్డారు. అవే రికార్డు స్థాయి కొనుగోళ్లకు కారణమని అధికారులు భావిస్తున్నారు.

పక్కా ప్రణాళిక అవసరమే..

ఊహించని దిగుబడుల కారణంగా... ధాన్యం సేకరణ, రవాణా, నిల్వ అన్ని అంశాల్లోనూ రైతులు, అధికారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ యాసంగిలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇకనైనా ప్రభుత్వం గోదాముల నిల్వ సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Last Updated : Jun 30, 2021, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details