తెలంగాణ

telangana

ETV Bharat / city

నల్లమలలో ఆ గ్రామస్థుల అరణ్యరోదన - అడవిలో అవస్థలు

తాము మునిగిపోతున్నా... తరతరాలకు నిలిచే మేలుచేశారు. ఇతరులకు వెలుగునిచ్చి... వారు అంధకారంలోకి వెళ్లిపోయారు. అందరి కోసం సర్వం ధారబోసినా... ఆ త్యాగం కాలగర్భంలో కలిసిపోయింది. ఆనాటి పాలకుల హామీలు గంగలో కొట్టుకుపోగా... నేటి ప్రభుత్వాల ఆంక్షలు వేదనకు గురిచేస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుతో ఆనాడు పొట్ట చేతబట్టుకుని నల్లమలలోకి వెళ్లిన ఓ గ్రామస్థుల గోడు అరణ్యరోదన మారింది.

yerragattu bollaram people living in forest
నాడు సర్వం ధారపోసి.. నేడు అడవిలో అవస్థలు

By

Published : Feb 3, 2021, 5:35 PM IST

నాడు సర్వం ధారపోసి.. నేడు అడవిలో అవస్థలు

ఉండటానికి గూడు ఉండదు. తినడానికి తిండి దొరకదు. కంటినిండా నిద్ర పట్టదు. సర్కార్‌ అడిగిందని సర్వం ధారబోసిన చివరకు బతుకులు చివరకు అడవిపాలయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు... 40ఏళ్లుగా వారంతా ఊరు విడిచి అరణ్యంలోనే బతుకులీడుస్తున్నారు. ప్రజాశ్రేయస్సు కోసం పెద్ద మనస్సుతో ఆలోచించిన వారంతా... నేడు తలదాచుకునేందుకే అవస్థలు పడుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించే సమయంలో బ్యాక్‌వాటర్‌ కారణంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని పలుగ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో అక్కడి గ్రామాలన్నింటిని ఖాళీ చేయించిన నాటి ప్రభుత్వం.... వారందరికీ మరోచోట పునరావాసం కల్పించింది.

ఇళ్ల స్థలాల హక్కు పత్రాలు..

ఇందులో భాగంగానే... నదీతీరంలోని మొగలోతు బొల్లారం గ్రామానికి నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న మొలచింతలపల్లి వాగు సమీపంలో పునరావాసం ఏర్పాటు చేశారు. ఎర్రగట్టు ప్రాంతంలో సర్వే నెంబరు 399లో ఇళ్ల స్థలాల హక్కు పత్రాలు ఇవ్వడంతో అక్కడే గుడిసెలు వేసుకుని నిర్వాసితులంతా జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంతమే ఎర్రగడ్డ బొల్లారంగా ఏర్పడగా.. దళిత, చెంచు జాతులకు చెందిన 120కి పైగా కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. సమీపంలోని పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ ఈ గ్రామస్థులు జీవనం సాగిస్తూ వచ్చారు.

ఎక్కడ నిర్మాణాలు చేపట్టినా..

అడవిలో లభించే ఆహారపదార్థాలు, ఇతర ఉత్పత్తులపైనే ఆధారపడి ఈ గ్రామస్థులు జీవనం సాగిస్తున్నారు. ఇలా కొన్నాళ్ల పాటు ప్రశాంతంగా సాగిన వీరి జీవితాల్లో.. అటవీ అధికారుల ఆంక్షలతో కష్టాలు మొదలయ్యాయి. గ్రామంలోని స్థలాలన్నీ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని.. ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. నాటి నుంచి గ్రామంలో ఎక్కడ నిర్మాణాలు చేపట్టినా.. వాటిని కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ పరంగానూ ఎలాంటి అభివృద్ధి పనులు జరగకుండా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే వారు వచ్చి నిర్మాణాలు అభ్యంతరంలేదని చెబుతుంటారు. ఇలా ఒకరు ఇళ్లు నిర్మించుకోమంటుండగా.. మరొకరు కూల్చివేస్తున్న వైనం. చేసేదిలేక ఏళ్ల తరబడిగా ఇక్కడి వారంతా గుడిసెల్లోనే నివాసముంటున్నారు.


అందని ద్రాక్షగానే..

విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు ప్రభుత్వ పథకాలు, ఉపాధి కల్పన ఈ గ్రామ ప్రజలకు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. ఉన్న ప్రభుత్వ పాఠశాలను సైతం ఇప్పటికే ఎత్తేశారు. ఏళ్ల తరబడిగా అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు మానవ హక్కుల సంఘాన్ని సైతం వీరు ఆశ్రయించారు. మొదట్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా... నాడు పత్రాలిచ్చిన అధికారులదే తప్పంటూ ప్రస్తుతం ఇప్పుడు దాటవేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.

అడవిలో అవస్థలు

సర్కార్‌ అడగ్గానే ఆనాడు సర్వం ధారపోసి.. నేడు అడవిలో అవస్థలు పడుతున్నట్లు ఇక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.


ఇవీ చూడండి:మొన్న కోళ్లు.. నిన్న కాకులు.. ఇవాళ కుక్కలు

ABOUT THE AUTHOR

...view details