ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో శీతాఫలాల శుద్ధి కేంద్రాల ఏర్పాటు మంచి ఫలితాలనిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, దామరగిద్ద, మద్దూరు లాంటి ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మంచి ఫలితాలు సాధించగా.. తాజాగా డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటలో శీతాఫలాల ప్రాసెసింగ్ యూనిట్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు వల్ల పళ్లు సేకరించే వాళ్లు, కొనుగోలు చేసే మహిళ సంఘాలు, మహిళలకు ఉపాధి, ఆదాయం లభిస్తోంది.
ఖర్చు తగ్గింది.. ఆదాయం పెరిగింది
నవాబుపేట శీతాఫలాల శుద్ధి కేంద్రానికి.. శీతాఫలాలను తీసుకురావడానికి మండల కేంద్రంతో పాటు.. చుట్టుపక్కల ప్రాంతాలైన పోమాల్, కామారం, జంగమాయపల్లి, మరికల్, రేకుల చౌడాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఆయా ప్రాంతాల్లోని రైతులు, కూలీలు సీతాఫలాలను సేకరించి మధ్య దళారులకు, లేదంటే పట్టణాలకెళ్లి అమ్ముకునే వాళ్లు. దీనికి ఒక రోజు మొత్తం పట్టేది. దీనికి తోడు.. పట్టణాలకు వెళ్తే రవాణా ఖర్చులు భారమయ్యేవి. ఇప్పుడు ఊళ్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల సేకరించిన పళ్లను ఊళ్లోనే అమ్మి మిగతా సమయంలో రోజువారీ పనులు చేసుకుంటున్నారు. రవాణ ఖర్చులు కూడా మిగులుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ కాయకు రు.12, బీ గ్రేడ్ కాయకు రూ.10, మామూలు కాయలకు రూ.6 నుంచి రూ8 వరకు చెల్లిస్తున్నారు. మునుపటి కంటే ఎక్కువ ఆదాయాన్ని రావమడే గాక.. శ్రమ, సమయం కూడా తగ్గుతోంది. ఇక ఫలాల్ని సేకరించిన మహిళా సంఘాలకు కిలోకు 50 పైసల వరకూ కమిషన్ చెల్లిస్తున్నారు.
50 మందికి ఉపాధి..
సేకరించిన శీతాకాయల్ని ప్రాసెసింగ్ యూనిట్‌కు తీసుకువచ్చి పళ్లుగా మార్చుతారు. పళ్లలోంచి గుజ్జును, గింజల్నివేరు చేస్తారు. ఇందుకోసం మహిళలను నియమించుకున్నారు. తద్వారా ఆ ప్రాంతంలో దాదాపు 50 మంది ఉపాధి పొందుతున్నారు. చేత్తో గుజ్జుని, గింజను వేరు చేస్తే దాన్ని మ్యాన్ మేడ్ పల్పీ అంటారు. దీనికి మార్కెట్లో డిమాండ్, ధర ఎక్కువ. అలా కాకుండా యంత్రాలతో గుజ్జు, గింజల్ని వేరు చేస్తే ఆ గుజ్జుకు డిమాండ్, ధర తక్కువ. కాని నవాబుపేటలో అత్యాధునిక యంత్రాలను వాడటంతో రెండు రకాలుగా వేరు చేసిన గుజ్జుకు దాదాపుగా ఒకే ధర పలుకుతోంది. అలా తీసిన గుజ్జును మైనస్ 40 డిగ్రీల వద్ధ శీతలీకరించి.. ఆ తర్వాత ఫ్రీజర్లలో భద్రపరచుతారు. ఈ ప్రక్రియనంతా పూర్తి చేయడానికి షిఫ్టుకు 15మంది చొప్పున రెండు షిఫ్టుల్లో 30 మంది మహిళలు పనిచేస్తున్నారు. కొద్ది రోజుల్లో మూడో షిఫ్టు సైతం మొదలు కానుంది. ఒక్కొక్కరి రోజుకు రూ.250 వేతనం చెల్లిస్తున్నారు.