తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాద్రి శ్రీసీతారాముల వారి ఆలయంలో నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. జానకిరాముల కల్యాణ వేడుక కోసం మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోక కల్యాణంగా భావించే కమనీయమైన కల్యాణ మహోత్సవానికి భద్రాద్రి ఆలయ అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. కల్యాణ ఘట్టానికి సంబంధించిన పూజలు, కల్యాణ మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగనున్నాయి. ఇందుకోసం మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా కల్యాణ మండపాన్ని అలంకరింపజేశారు.
వేద మంత్రోచ్చరణాలు మధ్య..
తొలుత తిరు కల్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టనున్నారు. కల్యాణానికి ఉపయోగించే సామాగ్రిని సంప్రోక్షణ చేసిన తర్వాత.. రక్షా బంధనం నిర్వహించి యోక్త్రధారణ చేస్తారు. ఇందులో యోక్త్రధారణ రమణనీయంగా ఉంటుంది. దర్భలతో ప్రత్యేకంగా అల్లిన తాడుని సీతమ్మవారి నడుముకి బిగిస్తారు. సీతారాములకు రక్షాబంధనం కడతారు. స్వామి గృహస్త ధర్మం కోసం యజ్ఞోప వీతధారణ చేస్తారు. తాంబూలాది సత్కారాలు చేసి కన్యావరుణ నిర్వహిస్తారు.
శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయిస్తారు. ఇరు వంశాల గోత్రాలను పఠిస్తారు. స్వామివారి పాద ప్రక్షాళన చేసి.. మహాదానాలు సమర్పిస్తారు. వధూవరులకు మంగళం చేకూర్చాలనే భావనతో అందించే ఈ ఆశీస్సులు కల్యాణం వీక్షించే భక్తులందరికీ వర్తించేలా ఉంటాయి. కల్యాణ వైభవాన్ని చాటిచెప్పేలా చూర్ణికను పఠిస్తారు. వేద మంత్రోచ్చరణాలు మారుమోగుతుండగా...అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచే సమయాన్ని శుభ ముహూర్తమని కీర్తిస్తారు.
ఏర్పాట్లు పూర్తి
భక్తులకు పరమానందం కలిగించే ఈ వేడుక కోసం ఆలయ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేకంగా సెక్టార్లు ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చలువ పందిళ్లు వేసి భక్తులంతా కూర్చుని రాములోరి కల్యాణం వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా మిథిలా మైదానంలో ఫ్యాన్లు, కూలర్లు అమర్చారు. మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు.
జానకిరాముల కల్యాణానికి సర్వం సిద్ధం
లోక కల్యాణంగా భావించే రాములవారి కల్యాణానికి భద్రాద్రి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లఘ్నమున సీతారాములకు జరిగే కమనీయమైన కల్యాణ వేడుక భక్తకోటికి మధురానుభూతుల్ని మిగల్చనుంది. జగదేకవీరుడికి, జగన్మాత సీతమ్మదేవికి అత్యంత వైభవోపేతంగా జరిగే కల్యాణాన్ని కనులారా తిలకించి పులకించేందుకు ఆశేష జనవాహిని ఎదురుచూస్తోంది.
సర్వాంగ సుందరంగా భద్రాద్రి క్షేత్రం
ఎన్నికల కోడ్ కారణంగా...
స్వామి వారి కల్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. గతంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే వచ్చి రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించారు. కానీ ఈ ఏడాది కల్యాణానికి సీఎం హాజరు కావడం లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే అవకాశం లేదని ఆలయ అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: వేములవాడలో కన్నుల పండువగా సీతారాముల కల్యాణం
Last Updated : Apr 14, 2019, 6:34 AM IST