తెలంగాణ

telangana

ETV Bharat / city

Ganja Smuggling: గంజాయి విక్రేతలుగా పోలీసులు.. విచారణలో విస్తుగొలిపే నిజాలు

కంచే చేను మేసిన చందంగా మారింది ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసుల తీరు. సీఎం కేసీఆర్​ ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణాపై (Ganja Smuggling in khammam) ఉక్కు పాదం మోపిన పోలీసు శాఖకు ఖమ్మం జిల్లాలోని కొందరు ఖాకీలు షాకిచ్చారు. స్మగ్లర్ల ఆట కట్టించాల్సిన పోలీసులే గంజాయి సరఫరాదారులుగా మారుతుండటం ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

police act as ganja supplier's
police act as ganja supplier's

By

Published : Nov 4, 2021, 5:36 AM IST

ఛత్తీస్​గఢ్ నుంచి భద్రాచలం.. వయా ఖమ్మం మీదుగా ఓ వ్యక్తి గంజాయి (Ganja Smuggling in telangana)తరలిస్తున్నారన్న సమాచారంతో రెండ్రోజుల క్రితం పోలీసు, ఆబ్కారీ శాఖ అధికారులు సంయుక్తంగా దాడి చేసి స్మగ్లర్​ను పట్టుకున్నారు. ఖమ్మం నగరంలోని గంజాయి విక్రయించేందుకు సదరు వ్యక్తి తెచ్చిన 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా (Ganja Smuggling in khammam)చేస్తున్నాడు. ఏ ప్రాంతం నుంచి తెచ్చి విక్రయాలు జరుపుతున్నాడు. అసలు సరఫరాదారుడు ఎవరన్న అంశాలపై ప్రశ్నించిన పోలీసులకు సరఫరాదారుడు ఇచ్చిన సమాధానం విస్తుగొలిపేలా చేసింది. గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డ సతీష్ తాను ఏఆర్ కానిస్టేబుల్​ని, తొలిసారి డీల్​లో పాల్గొన్నానని చెప్పడంతో పోలీసులు నివ్వెరపోయారు.

ఇద్దరూ పోలీసులే..

ఇదంతా ఒక ఎత్తైతే సతీష్​కు భద్రాచలంలో గంజాయి అప్పగించిన మరో వ్యక్తి కూడా పోలీస్ కానిస్టేబుల్ కావడం ఇప్పడు ఉమ్మడి జిల్లా పోలీసు శాఖలో కలకలం రేపుతున్న అంశం. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న మరో ఏఆర్ కానిస్టేబుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇలా గంజాయి అక్రమ రవాణాలో ఇద్దరు పోలీసు సిబ్బంది పాత్ర బహిర్గతమవడం ఉభయ జిల్లాల పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.

కీలక ప్రధానపాత్రదారు.. రైల్వే కానిస్టేబుల్​

సెప్టెంబర్ 23న ఖమ్మం గ్రామీణం మండలంలోని పెద్దతండా, నాయుడుపేట ప్రాంతాల్లో జోరుగా గంజాయి అమ్మకాలు సాగుతున్నట్లు టాస్క్​ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన బృందాలు వరంగల్​ క్రాస్​రోడ్డు నుంచి ఖమ్మం రైల్వే స్టేషన్​కు గుట్టుచప్పుడు కాకుండా వేర్వేరు బ్యాగుల్లో తరలిస్తున్న 4 కిలోల గంజాయిని నాయుడుపేట వద్ద పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వీరిలో ప్రధాన పాత్రదారుగా తేలిన రామకృష్ణ రైల్వే కానిస్టేబుల్. ఖమ్మంలో రైల్వే కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పడం పోలీసు వర్గాలను ఆశ్చర్య చకితుల్ని చేసింది. రైల్వే పోలీస్ గంజాయి విక్రయిస్తున్నట్లు తేలడం పోలీసు, రైల్వే శాఖల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సదరు కానిస్టేబుల్ రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది.

గంజాయి మాఫియాతో..

ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం నెలన్నరలోపే పోలీసు శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది గంజాయి విక్రయాలకు పాల్పడుతూ పట్టుబడటం పోలీసు శాఖకు మాయని మచ్చలా మారింది. శాంతిభద్రతలు కాపాడంతోపాటు అసాంఘిక కార్యకలాపాల పీచమణచాల్సిన పోలీసులే గంజాయి మాఫియాకు తొత్తులుగా మారి నేరుగా గంజాయి విక్రయాలకు పాల్పడటం ఆ శాఖలో తీవ్ర కలకం రేపుతోంది. ఇంతకాలం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గంజాయి మాఫియాకు పోలీసు శాఖలో కొంతమంది అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలే వినిపించాయి. తాజాగా గంజాయి మాఫియాతో నేరుగా చేతులు కలిపి సరఫరాదారులుగా మారుతుండటం పోలీసు శాఖ ప్రతిష్టను మరింత దిగజారుస్తోంది.

గంజాయి దందాకు కేరాఫ్​గా..

రాష్ట్రంలోనే అత్యధికంగా గంజాయి రవాణాకు అడ్డాగా ఉన్న జిల్లాల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు ఉన్నాయి. విశాఖ మన్యం నుంచి నిత్యం భారీగా గంజాయి ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు తరలిపోతోంది. గుట్టుచప్పుడు కాకుండా నిత్యం రూ.కోట్లల్లో సాగుతున్న గంజాయి దందాకు ఉభయ ఖమ్మం జిల్లా కేరాఫ్​ అడ్రస్​గా మారుతుంది. విశాఖ, సీలేరు, పాడేరు, రంపచోడవరం, చింతూరు నుంచి భద్రాచలం మీదుగా గంజాయి తరలిస్తున్నారు. భద్రాచలం నుంచి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా కేంద్రాల నుంచి గంజాయి తరలిపోతుంది. ఇలా రోజూ క్వింటాళ్ల కొద్దీ గంజాయి హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, గోవా వంటి ప్రాంతాలకు వెళ్తోంది. ఒక్కో ప్రాంతం దాటితే ఒక్కో రకంగా సరఫరాదారులకు వ్యాపారులు డబ్బులు ముట్టజెప్పుతారు. రాష్ట్ర సరిహద్దులు దాటిస్తే గంజాయి వ్యాపారులు రూ.కోట్లు మూటగట్టుకున్నట్లే.

కళ్లున్నా చూసీచూడనట్లే..

మూడుపూలు ఆరు కాయలు సాగే గంజాయి అక్రమ రవాణాలో తలాపాపం తిలా పిడికెడు అన్నట్లు ఉంది. ముఖ్యంగా కొంతమంది పోలీసులకు తెలిసే ఈ అక్రమ రవాణా సాగుతుందన్న ఆరోపణలు ఈనాటివి కావు. విశాఖ మన్యం నుంచి సరఫరా అయ్యే గంజాయి భద్రంగా హైదరాబాద్, ఇతర రాష్ట్రాలకు చేరుతుందంటేనే అర్థం చేసుకోవచ్చు.

రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 15 పోలీస్ స్టేషన్ల పరిధి దాటాల్సి ఉంది. గంజాయి సరఫరాపై ఇసుమంత సమాచారం ఉన్నా ఎక్కడో ఓ చోట గంజాయిని పట్టుకునే వీలుంది. కానీ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అన్నచందంగానే ఉభయ జిల్లాల్లోనూ గంజాయి పట్టుబడుతోంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, రైళ్ల ద్వారా సరఫరా చేస్తున్న కొన్ని సమయాల్లోనే గంజాయి పట్టుబడుతుంది. పైపైకి తరచూ తనిఖీలు, విస్తృత సోదాలు నిర్వహిస్తున్నా.. పోలీసులు పట్టుకునేది కొద్ది మొత్తంలో గంజాయి మాత్రమే. ఇలా గంజాయి సరఫరా సజావుగా సాగేందుకు శాఖలో చాలామంది అండదండలు పరోక్షంగా పుష్కలంగా ఉన్నాయన్న విమర్శలకు కొదవే లేదు. గంజాయి బడా వ్యాపారులు, స్మగ్లర్ల నుంచి కొందరికి నెలవారీగా ముడుపులు అందడం, మరికొందరికైతే ఏకంగా ఏడాదికి ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు మూటలు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ప్రధానంగా దృష్టి సారించినప్పుడో, ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చినప్పుడో తప్పితే గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసుల చర్యలు అంతంత మాత్రమేనన్నది బహిరంగ రహస్యం.

ఇంటి దొంగల గుట్టు తేల్చాలే..

గంజాయిపై ఉక్కుపాదం మోపుతూ స్మగ్లర్ల ఆట కట్టించాల్సిన విధుల్లో క్రియాశీల పాత్రపోషించాల్సిన పోలీసులే ఏకంగా సరఫరాదారులుగా మారుతుండటం ఇప్పుడు ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఖమ్మంలో పట్టుబడ్డ ఏఆర్ కానిస్టేబుల్ సతీష్, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తించే మరో కానిస్టేబుల్ వెంకట్ కొంతకాలంగా గంజాయి విక్రయాల్లో భాగస్వాములైనట్లు సమాచారం. ఈ దందాలో వీరికి మరి కొంతమంది పరోక్షంగా సహకారం అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా కారాగారంలో పనిచేసే మరి కొంతమంది... శాఖకు చెందిన సిబ్బంది ఈ దందాలో అండగా ఉన్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

ఖైదీలతో పరిచయం..

గంజాయి కేసుల్లో పట్టుబడి కారాగారంలో జైలు శిక్ష అనుభవించే ఖైదీలను వీరికి పరిచయం చేయడం, తద్వారా గంజాయి విక్రయాలు సాగేలా చూస్తున్నారన్న చర్చ సాగుతుంది. జిల్లాతోపాటు ఖమ్మం నగరంలో ప్రధానంగా గంజాయి ఎక్కడ ఎక్కువ విక్రయించవచ్చు. ఏయే ప్రాంతాల్లో ఎక్కువ గంజాయి సేవిస్తారు. ఎలా విక్రయించాలి అన్న అంశాలపై స్మగ్లర్ల నుంచి వీరికి తర్ఫీదు ఇచ్చిన తర్వాతే రంగంలోకి దిగినట్లు సమాచారం.

అయితే..శాఖకు చెందిన సిబ్బందే స్వయంగా గంజాయి విక్రయిస్తు పట్టుబడటంపై ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ అక్రమ దందాలో కీలక సూత్రదారులు ఎవరు, ఇంకా ఎవరైనా పోలీసు సిబ్బంది, అధికారుల పాత్ర ఉందా అన్న అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అయితే గంజాయి దందాపై లోతైన దర్యాప్తు చేస్తేనే మరికొందరి బాగోతం బయటపడే అవకాశాలు ఉన్నాయి. బజారున పడిన శాఖ పరువు నిలబెట్టుకోవాలంటే అక్రమ దందాలో మరకలు అంటిన అందరిపైనా చర్యలకు దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కఠిన చర్యలు తప్పవు..

' గంజాయి రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగానే జిల్లాలో పోలీసు శాఖ పనిచేస్తుంది. నేరస్తులు ఎంతటివారైనా చట్టం ముందు నిలబెడతాం. గంజాయి అక్రమ రవాణాలో సిబ్బంది పాత్ర వంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. శాఖపరమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో నిబద్ధతతో పనిచేసేవారికి తగిన గుర్తింపు దక్కుతుంది.'

- విష్ణు.ఎస్.వారియర్, పోలీస్ కమిషనర్, ఖమ్మం

ఇదీచూడండి:Ganja Smuggling: గంజాయి దారులు మూసేలా .. పోలీసు, ఎక్సైజ్‌ శాఖల వ్యూహం!

ABOUT THE AUTHOR

...view details